Thursday, 5 September 2013

తుఫాన్


సాయంత్రం 6.00 గంటలు కావస్తోంది. ఆకాశమంతా మసిపూసినట్లు నల్లని మేఘాలు అలుముకుంటున్నాయి. మబ్బుల్లో ఎక్కడో బాణాసంచా కాల్చినట్లు మెరుపులు, ఉరుములు. ఒక్క ఉదుటున కబళించే సముద్రపు కెరటంలా అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలి. దానికి తోడు వర్షం. ఏదో ప్రళయం రాబోతోందన్న భయంతో అందరూ ఇంటి తలుపులు, కిటికీలు మూసేశారు. గాలి తగ్గినా వర్షం తగ్గలేదు. కుండపోతగా వర్షం. గాలివల్లనేమో కరెంటు కూడా ఆపేశారు.

“ దీనిదుంపతెగా , దీనికేమీ పోయేకాలం, నిన్నటిదాకా ఎండలు మండించింది. ఇప్పుడేమో ఒక్కసారిగా విరుచుకుపడింది” దూషణ పర్వం ప్రారంభిస్తూ ఎండ, వానలను తిట్టిపోసింది ఆ ఇంట్లో ముసలావిడ.

“ ఎండ కాసినంతసేపు వాన రాలేదంటావు. వానొస్తే మాత్రం శాపనార్దాలు పెడతావ్. మీ ముసలోళ్లతో ఇదే తంటా” మాట కలిపాడు మనవడు.

“ఎప్పుడూ నన్ను ఆడిపోసుకోకపోతే ఆడపిల్ల ఇంకా ఇంటికి రాలేదేమీటా అన్న ఆలోచననేమైనా వున్నదట్రా నీకు. ఎంతసేపటికి చదువు చదువు అనే ధ్యాసే గాని. ఆడపిల్లని అంత దూరం పంపి చదివించాలా. పొద్దుననంగా పోయి రాత్రికిగాని రాదు. ప్రతి రోజూ యాభై మైళ్ళ దూరం రాను పోను రైలులో ప్రయాణం ఎంత కష్టం. మీ అమ్మ నాన్నలకు ఎంత చెప్పినా వినలేదు. ఈ గాలి వానకి ఎట్లా చేస్తుందో ఏమో. నాకైతే మనసు నిలవట్లేదు”. కోచింగ్ కని ప్రతి రోజు రైలు లో వెళ్ళి వస్తున్న మనుమరాలు జ్యోతిని గురుంచి చిర్రుబుర్రులాడింది ముసలావిడ.

అవును అమ్మాయి రైలు దిగి ఈ గాలి వానకి ఎలావస్తుంది? అసలు రైలు వస్తుందా లేక వర్షాలకి ఎక్కడైనా ఆపేశారా? ఆపేస్తే అమ్మాయి పరిస్థితేంటి? అనుకుంటూ ఆందోళన పడసాగింది అమ్మాయి తల్లి వాసంతి.

“ చందూ ! గొడుగు తీసుకొని అలా స్టేషన్ దాకా వెళ్ళి జ్యోతిని తీసుకురారాదూ” కొడుకుతో చెప్పింది వాసంతి.

సాయంత్రం ఆరు గంటలకు రావలసిన రైలు ఎనిమిది గంటలు కావస్తున్నా ఇంకా రాలేదేమిటా అనుకుంటూ జోరున కురుస్తున్న వర్షంలో స్టేషనుకు బయలుదేరాడు చందు. కరెంటు లేనందువల్ల దారంతా చీకటిగా వుంది. హెడ్ లైట్లను బట్టి వాహనాల రాకపోకలను తెలుసుకోగలుగుతున్నాడు గాని వచ్చేపోయే మనుషులు అస్సలు కనపడటంలేదు. చేతిలో టార్చ్ లైటు కూడా లేదు. అలవాటైన దారి కాబట్టి ఎలాగోలా స్టేషన్ కు చేరుకున్నాడు. స్టేషన్ లో ప్రయాణీకులు పెద్దగా కనపడలేదు. ఒకరో ఇద్దరో షెడ్ల క్రింద బెంచీలమీద ముసుగులు కప్పుకొని పడుకోనున్నారు. కొందరు వారికి అవకాశమున్న చోట తలదాచుకున్నారు. వర్షం వల్లనో ఏమో స్టేషన్ నిర్మానుష్యంగా వుంది. కొంపదీసి ట్రైను వెళ్లిపోలేదుగదా ‘ ఒకవేళ ట్రైను వచ్చిగానివుంటే జ్యోతి ఎక్కడికెళ్లినట్లు ? ఏ విషయం ఫోను చేసి చెప్పొచ్చుగదా. నిర్లక్ష్యం కాకపోతే. మూడు నాలుగు సార్లు జ్యోతి సెల్ కు కాల్ చేసినా స్విచ్ఆఫ్ అని వస్తోంది. అసహనంగా మనసులో చెల్లెలిని తిట్టసాగాడు చందు.

సందేహ నివృత్తికోసం స్టేషన్ మాస్టర్ దగ్గరకెళ్లి విచారించాడు. చావు కబురు చల్లగా చెప్పినట్లు ఆ రైలు కంటే ముందు వచ్చిన గూడ్స్ పట్టాలు తప్పింది. సింగిల్ లైను మీద రైళ్ల రాకపోకలు జరుపుతున్నారని చెప్పాడు స్టేషన్ మాస్టర్.

చచ్చాంరా దేముడా! ఇప్పుడెలా ? ఎంతసేపని వెయిట్ చెయ్యను ? ఈ అమ్మాయి ఎంత ఆందోళనపడుతుందో ఏమో ? టైమ్ కూడా తొమ్మిది దాటింది. ఎన్ని గంటలకు వస్తుందో ఏమో ? అనుకుంటూ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాడు చందు. ఆ హాల్లో ఎవ్వరూలేరు, తనొక్కడే. ఈదురు గాలులకు చలి ఒళ్ళంతా వణికిస్తోంది. గాలి అంతగా రాని ఓ మూల ముడుచుకొని కూర్చున్నాడు. కూర్చున్నదే తడవు కునుకులోకి జారీ పోయాడు. అలా ఎంతసేపు నిద్రపోయాడో తెలియదు. మెళుకువ వచ్చేసరికి ప్రక్కన మరో ప్రయాణీకురాలు కూర్చోనుంది. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత ఆకర్షణీయంగా వుందామె. చందు పదే పదే ఆమెనే చూడసాగాడు. ఇంత రాత్రి వేళ ఒక్కతే ఎక్కడికెళ్లాలని వచ్చింది? పాపం ట్రైన్స్ సరిగా రావట్లేదని తెలిసినట్లు లేదు అనుకుంటూ వాచీ వంక చూసుకున్నాడు. సరిగ్గా 12.00 గంటలు. బాబోయ్ ఇదేమిటి ఇంత టైమ్ అయ్యింది. ఎంతసేపు నిద్రపోయాను? కొంపదీసి విజయవాడ వెళ్ళే ట్రైన్ వెళ్లిపోయిందా? ఒక్క వుదుటున స్టేషన్ మాస్టర్ దగ్గర కెళ్ళి విచారించాడు.

విజయవాడ వెళ్ళే ట్రైన్ 10.00 గంటలకే పోయిందన్న మాటతో ఖంగు తిన్న చందులో ఆందోళన ప్రారంభమయ్యింది. ఇంతకూ జ్యోతి వచ్చిందా? రాలేదా? వచ్చి వుంటే ఒక్కటే ఇంత రాత్రి వేళ వర్షంలో ఇంటికెలా వెళ్లింది? ఒకవేళ వెళ్ళివుంటే నేను ఇంట్లో తిట్ల పురాణం భరించాల్సిందే అనుకుంటూ ఇంటికి ఫోను చెయ్యబోతే సెల్ లో బాలన్స్ నిల్. స్టేషన్ ఎదురుగా వున్న టీ కొట్లో కాయిన్ ఫోన్ ద్వారా ఇంటికి ఫోను చేశాడు. అనుకున్నట్లే అయ్యింది. జ్యోతి వర్షం వల్ల రావడంలేదని, తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వుందని తెలిసి ఊపిరి పీల్చుకున్నాడు. ఇంత రాత్రి వరకూ ఇంటికి రానందుకు అక్షింతలు తప్పలేదు. ఏమైతేనేం మనసు ప్రశాంతంగా వుంది. వర్షం ఇంకా తగ్గలేదు. చేతిలో గొడుగున్నా అంతా రాత్రి వేళ ఒంటరిగా రావడానికి కొంచెం భయంగానే వుంది. ఇంటికి వెళ్లాలంటే ట్రాక్ ప్రక్కనే నడిచి వెళ్ళితే దగ్గర దారవుతుంది. లేకపోతే చుట్టూ తిరిగివెళ్లాల్సి వుంటుంది. అందుకే చీకటిలో ఒంటరిగా రాలేక అటువైపు వెళ్ళే వాళ్లెవరైనా వుంటే వారితో కలిసి వెళ్లాలన్న వుద్దేశ్యంతో కొద్దిసేపు అక్కడే వుండిపోయాడు. ఇంతలో ఆమెతో మాట కలపాలనుకున్నాడు.

“ఎక్కడికెళ్ళాలండి ? మాట కలిపాడు చందు.

“శాంతి నగర్”. సమాధానమిచ్చిందామె

“ అంటే స్టేషన్ కు దగ్గరేగా ”

“అవును”

“ఇంతరాత్రివేళ ఇక్కడికెందుకొచ్చారు ?

“ ఇప్పుడే రైలు దిగాను. వర్షం ఎక్కువగావుంటే ఇక్కడకూర్చున్నా”

“ మీ వాళ్లెవరైనా వస్తారా?

“ లేదండీ, నేను వచ్చేది వాళ్ళకు తెలియదు”.

“ ఫోను చెయ్యకపోయారా?

“ వాళ్ళందరూ వేరే ఊళ్ళకు పోయున్నారు. అందువల్ల చేయలేదు”.

“ ఇప్పుడెలా చేస్తారు?

“ పోనీ మీరు సహాయం చెయ్యకూడదూ! అభ్యర్ధనగా అడిగిన ఆమె మాటలకు కాదనలేక పోయాడు చందు. అంత అందమైన ఆమె మాటలకు మంత్రముగ్ధునిగా సరే నన్నాడు. రైల్వే స్టేషన్ కు పడమటి వైపు దారిన ఒకే గొడుగులో ఇద్దరూ సగం సగం తడుస్తూ ఆమె ఇంటికి బయలుదేరారు. అసలే కరెంటు లేదు. చీకటిలో గతుకుల రోడ్డుపై వర్షపు నీళ్ళలో అడుగులు తడబడుతూ నడుస్తున్నాడు చందు . అలవాటైన దారి కాబట్టి ఏ తడబాటు లేకుండా నడుస్తోందామె. గొడుగులో ఇద్దరూ ప్రక్క ప్రక్కనే వున్నందున అప్రయత్నంగానే ఇరువురి శరీరాలు తాకుతున్నాయి. అలా తాకుతుంటే చందుకు ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. శరీరంలో వేడి రగులుతోంది. మనసులో ఏదో అలజడి. అంతటి వర్షంలోనూ నోరు తడారిపోతోంది. ఇంతలో ఆమె ఇల్లు రానేవచ్చింది. చీకటి గుహలా వుందా ఇల్లు. విరిగిపోయిన గేటు త్రోసుకొని ఇంట్లోకి ప్రవేశించిందామె. చందు ఆమెను అనుసరించాడు.

“లోపలకి రా “ పిలిచిందామె.

చీకటిలో ద్వారం ఎక్కడో కనపడక లోపలకెలా వెళ్లలో అర్ధం కాలేదు చందుకు.

“లోపలకి రా” మళ్ళీ పిలిచిందామె.

మనిషి కనపడటం లేదు. ఇంటి లోపలి నుండి మాటలు వినపడుతున్నాయి.

“ ఎక్కడ ? ఎక్కడున్నారండీ? అడిగాడు చందు.

“ ఇక్కడే. లోపలకు పోదాం రండి” అన్న ఆమె మాటలకు ఉలిక్కి పడ్డాడు చందు. అప్పటివరకూ తనకు కనిపించని ఆమె తన ప్రక్కనే నిలబడి వుంది. మనిషిలో ఏదో తేడా కనిపిస్తోంది. తనవైపే తదేకంగా చూడటం చీకట్లో అస్పష్టంగా కనిపిస్తోంది.

చందు మనసులో ఏదో అనుమానం. కొంపదీసి ఇది తిరుగుబోతు కాదుగదా. తనను ఇలా ట్రాప్ చేసిందా అనుకొనేలోపే తన చెయ్యి పట్టుకుందామె. ఆ స్పర్శకు ఒళ్ళంతా ఝల్లుమనిపించింది. గాలి తీసిన సైకిల్ ట్యూబ్ లా వుందామె చేయి. ఊహించని ఈ పరిణామానికి శరీరమంతా ఒక్కసారిగా చల్లబడి పోయింది. ఒక్క ఉదుటున గేటు వైపు దూకాడు. పరుగెత్తేందుకు శక్తి రావడంలేదు. కాళ్ళు చచ్చుబడిపోయినట్లున్నాయి. ఎవ్వరూ కనపడలేదు. వానకు ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు బిగించుకొనున్నారు. చీకటిలో వచ్చిన దారి మరిచిపోయాడు. వెనుతిరిగి చూశాడు. ఆమె వెనకనే తనను అనుసరిస్తున్నట్లుంది. అటూ ఇటూ పరుగెత్తసాగాడు. వీధిలోని కుక్కలు మొరగసాగాయి. చందుకు భయమేస్తోంది. కొంపదీసి దొంగననుకొని తరుముకోరుగదా. ఇంతలో రైలు కూత వినపడింది. అటువైపుగా అడుగులు వేశాడు. ఎట్టకేలకు రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. గుండె దడ తగ్గలేదు. అంత వర్షంలోనూ చెమటలు పడుతున్నాయి. స్టేషన్ మాస్టర్ గది ముందు బెంచీపై కూర్చున్నాడు. ఇంటికి ఎలా పోను. కటిక చీకటిగా వుంది. ఒకవేళ ఆమె ఎక్కడైనా దాగివుండి అటకాయిస్తే. చందుకు ఆలోచనలతో బుర్ర వేడెక్కుతోంది.

“ రావాల్సిన ట్రైన్స్ అన్నీ వెళ్లిపోయాయి ఇంకా ఇక్కడ కూర్చున్నారేమిటి ? అడిగాడు స్టేషన్ మాస్టర్.

చందుకు మాట పెగలడంలేదు. అటూ ఇటూ బిత్తరగా చూస్తూ ఆస్పష్టంగా ఏదో చెప్పాడు.

“ ఏమైంది ? ఎందుకలావున్నావ్ ? లోపలకు రా అంటూ గదిలోకి పిలిచాడు స్టేషన్ మాస్టర్. “ ఇప్పుడు చెప్పు ఏం జరిగింది? ప్రశ్నించాడు.

కొంచెంసేపు నిదానించి జరిగిన విషయం చెప్పాడు చందు.

“ అది మామూలే. ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. అయినా ఇంత ప్రొద్దుపోయిందాక ఒంటరిగా వుండడం మంచిది కాదు. మనిషిని తోడు పంపుతా ఇంటికి వెళ్ళు”. చందు పరిస్థితి గమనించి చెప్పాడు స్టేషన్ మాస్టర్. ఇంతలో ఫోన్ మ్రోగింది. ఇతర స్టేషన్ల నుండి ఏవో మెసేజస్ నోట్ చేసుకోసాగాడతాను.

స్టేషన్ మాస్టర్ పంపాడని వచ్చిన మనిషి తోడు రాగా ఇంటికి బయలుదేరాడు చందు. రైల్వే ట్రాక్ ప్రక్కనే నడవసాగారిద్దరూ.

“ఏం జరిగింది ? ఇంతసేపు ఒక్కడివే ఎందుకున్నావ్ ? దారిలో అడిగాడు తోడువచ్చిన మనిషి.

జరిగినదంతా చెప్పాడు చందు. అంతా విన్న తరువాత “ అదృష్టవంతుడివి బ్రతికి బయటపడ్డావ్. నీలాగే ఇద్దరు కుర్రాళ్ళు ఆమెతో వెళ్ళి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. స్టేషన్లో పని చేసే చాలా మందికి ఈ విషయం తెలుసు”. చెప్పాడాయన.

“ అసలామె ఎవరు? తిరుగుబోతా? ఆమె తాకగానే ఒళ్ళంతా అదోలా అయిపోయిందేమిటి? అసలు మనిషేనా ? సందేహం గా అడిగాడు చందు.

“ మనిషి అయితే కదా”

“ మరి’

“ దెయ్యం”

“ దెయ్యమా ? చందు శరీరం ఒక్కసారిగా భయంతో చల్లబడి పోయింది. అడుగులు తడబడుతున్నాయి. చీకటిలో ఆ దెయ్యం తన ప్రక్కనే వస్తున్నట్లుగా అనిపిస్తోంది. నోరు తడారిపోతోంది. మౌనంగా వుండిపోయాడు.

“ మూడునెలల క్రితం ఒకావిడ తిరుపతి వెళ్ళే ట్రైన్ ఈ స్టేషన్లో ఆగగానే దిగబోయి ట్రైన్ మూవ్ అయ్యేసరికి కాలుజారి దాని క్రింద పడి చనిపోయింది. అప్పటినుండి ఆమె దెయ్యమై ఈ స్టేషన్ పరిసరాల్లో తిరుగుతోందని చెబుతుంటారు. అప్పుడప్పుడు అర్థ రాత్రి 12 గంటల సమయంలో ప్రయాణీకురాలుగా వచ్చి ఎవరో ఒకరిని తన వెంట తీసుకుపోతుందట. అలా పోయినోళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు”. చెప్పాడతను.

చందుకు ఒళ్ళు జలదరించింది. ఏదో మైకం కమ్మినట్లుగా వుంది. భయం ఎక్కువైంది. పెద్దగా అరవాలనుకున్నా మాట బయటకు రావడంలేదు. దేవుళ్లందరిని తలుచుకోసాగాడు. చీకటిలో గుంటలు మిట్టలు ఏవీ పట్టించుకోలేదు. రొప్పుతూ రోస్తూ వేగంగా అడుగులు వేస్తున్నాడు. తనతో వచ్చిన వ్యక్తి అంతే వేగంగా అనుసరిస్తున్నాడు. ఇంతలో ఇల్లు వచ్చేసింది. ఇంట్లో వాళ్ళు నిద్ర కూడా పోకుండా కాచుక్కూర్చున్నారు. చందు గేటు త్రోసుకొని లోపలకెళుతూ తనతో వచ్చిన వ్యక్తిని లోపలకి రండి అంటూ పిలిచాడు.

చందూ వాళ్ళ అమ్మ వరండాలోకి వచ్చి చూసింది. అక్కడ ఎవరూ లేరు. “ ఎవర్ని రా రమ్మంటున్నావ్? అడిగింది.

“నాకు తోడుగా వచ్చిన మనిషి బయటి వర్షంలోనే నిల్చునున్నాడు”. అంటూ చందు గేటు వద్దకు వచ్చి చూశాడు. అక్కడెవరూ లేరు. ఇంతలో ఈయన ఏమైనట్లు. చందు మనసులో అనుమానపు తుఫాను కేంద్రీకృత మయ్యింది.