Wednesday, 17 April 2013

బడిలో దెయ్యం




           నేను యస్.యస్.యల్.సి. చదువుకొనే రోజులవి.   మా ఇంట్లో కరెంట్ లేనందున స్కూల్ హెడ్మాస్టర్ వారి సలహా మేరకు పబ్లిక్ పరీక్షలు జరిగే రోజుల్లో  హై స్కూల్ నందే లైట్లు వేసుకొని చదువుకొనేవాళ్లం.  స్కూల్ వెనుకనే మామిడితోట వుండేది.  స్కూల్ కి తోట కి మధ్య పెద్ద కర వుండేడి.  కరంతా ఎత్తైన కరతుమ్మ చెట్లు, సరస్వతి చెట్లుతో దట్టంగా చూసేందుకు భయంకరంగా వుండేది. రాత్రులేకాదు పగలు కూడా స్కూల్ వెనుకవైపుకు వెళ్లాలంటేనే భయమేసేది.  అక్కడ పాములు తిరగడం సర్వసాధారణం.  కొందరైతే అక్కడ దెయ్యాలు కూడా వున్నాయని చెబుతుండేవారు.  ప్రతిరోజూ రాత్రి 12.00 గంటలు వరకు చదువుకొనేవాళ్లం.  రాత్రికి అక్కడే పడుకొని తెల్లవారుజామున ఇంటికి వచ్చేవాళ్లం.  కానీ ప్రతిరోజూ  సరిగ్గా 12.00 గంటలు సమయంలో స్కూలు  మిద్దెమీద ఎవరో పరుగెడుతున్నట్లు శబ్దాలు వినిపించేవి.  మొదట్లో రెండు మూడు సార్లు తోటలో తిరుగుతున్న పిల్లులు అయివుంటాయిలే మేతకు అటుఇటు తిరుగుతున్నాయనుకున్నాము.   మేము మొత్తం 5 మందిమి  వుండేవాళ్లం.   ప్రతిరోజూ ఇలానే జరుగుతున్నందున  క్రమేపీ మాలో భయం చోటుచేసుకోసాగింది.   రాత్రి 12.00 గంటలు అవుతుందంటే చదువుపై మససు లగ్నం కావడంలేదు,  భయం తప్ప . 
                   
          పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి.  మాలో ఆందోళన ఎక్కువకాసాగింది.  దీనికి పరిష్కార మార్గం కనుక్కోవాలనుకున్నాము.  హెడ్మాస్టర్ గారికేమో బాగా చదువుతున్నామని చెబుతున్నాం.   మేము  ఐదుగురం కలిసి చర్చించుకున్నాం.   ఆ రోజు ఎలాగైనా ఆ శబ్దాలు ఏమిటో తెలుసుకోవాలని తీర్మానించుకున్నాం.  అందరం వారికి అందుబాటులో వుండే  టార్చ్ లైట్లు, మంచి కర్రలు తీసుకుపోయేందుకు నిర్ణయించుకున్నాం.   ఆ రోజు రాత్రి మా ఏర్పాట్లలో  మేము వున్నాం.  మిద్దె పైకి ఎక్కేందుకు నిచ్చెన కూడా ఏర్పాటు చేసుకున్నాం.    ఎప్పటిలాగే  అర్ధరాత్రి  12.00 గంటల సమయంలో  శబ్దాలు రావడం ప్రాంభమైనాయి.  అందరం ఊపిరి బిగబట్టుకొని గబగబా స్కూల్ పైకి ముందుగానే ఏర్పాటు చేసుకున్న నిచ్చెన ఎక్కి చూశాము.  కానీ మాకు అక్కడ ఏమి కనిపించలేదు.  శబ్దాలు కూడా ఆగిపోయాయి.  మా ప్రయత్నం విఫలమైంది.  పైకి ఎక్కి చూసినందుకు  భయం ఇంకా ఎక్కువైంది.
                    
          మా పబ్లిక్ పరీక్షలు కంటె ఈ విషయమే మాకు ఎక్కువ ఆందోళన కలిగించింది .  మరునాడు కూడా  పట్టువదలని విక్రమార్కునిలా మా ప్రయత్నం మేము చేశాము.  అయినా ఫలితం శూన్యం.  ఆ మరునాడు మా స్కూల్ వెనుకవైపునున్న మామిడి తోటలోని  కాపలా మనిషి స్కూల్ లోనికి రావడం జరిగింది.  మాటల సంధర్భంలో దెయ్యాలు ప్రస్తావన వచ్చింది.  అప్పుడు ఆయనతో ఈ శబ్దాలు గురుంచి చెబుతూ,  దెయ్యాలంటే  నీకు భయం లేదా ? ఒక్కడివే తోటలో ఎలా  పడుకుంటావు ?  అని అడిగాము.  అందులకు ఆయన నవ్వుతూ  “ఆ శబ్దమా మొదట్లో నేను కొంచెం జంకిన మాట వాస్తవమే.  తరువాత తెలుసుకున్నాక భయం పోయింది.”   అని చెప్పాడు.  అదేమిటని మేము ఆధుర్దాగా అడిగాము.   “ ఏమి లేదు.  సరిగ్గా అర్ధరాత్రి 12.00 గంటలప్పుడు కావలి లో  ఏదో రైలు బాగా స్పీడుగా పోద్ది.  ఆ శబ్దానికి బడి మిద్దె మీద దనదన శబ్దం వస్తుంది.  కావాలంటే ఈ రోజు రాత్రి  నేను కూడా వుంటాను చూద్దాం రాండి”.  అన్నాడు. 
                    
          ఆమాటతో కొంచెం ధైర్యం వచ్చింది.  చెప్పిన మాట ప్రకారం  తోట కాపలా మనిషి రాత్రి 12.00 కాక మునుపే స్కూల్ లో వున్న మా వద్దకు వచ్చాడు.  అందరం నిచ్చెన ద్వారా మిద్దె పైకి చేరుకున్నాం.  12.00 అయ్యేకొద్దీ మాలో ఏదో తెలియని భీతి.  కానీ అర్ధరాత్రి దాటినా శబ్దం రాలేదు.  ఏమైవుంటుంది.  మాకు మా ప్రక్కన వున్న వ్యక్తి మీద అనుమానం .  ఈయన నిజమే చెప్పేడా.  అసలు ఈయన మనిషేనా.  లేక ........... .  వెన్నెల పిండారబోసినట్లుంది.   అందరం ఒకరి ముఖం ఒకరం చూసుకున్నాము.  తక్షణం క్రిందికి దిగిపోవాలనిపించింది.  కదిలాము.  అంతలో శబ్దం వినొచ్చింది.  కావలి లో రైలు  కూత వినిపించింది.  రైలు యమ స్పీడ్ గా పోతున్నట్లు అర్ధమైంది. రాత్రి సమయాల్లో ప్రశాంతంగా వుంటుంది కాబట్టి చిన్న శబ్దం కూడా పెద్దగా అనిపించడం సహజం.  ఆ శబ్ద ప్రకంపనలకు భూమి, భవనాలు అదిరినట్లు అనిపిస్తాయి.  పగలైతే  మరీ దగ్గర్లో వుంటే తప్ప దూరప్రాంతాలకు ఇవేమీ వినిపించవు.  అప్పటికి గాని మా సందేహం తీరలేదు.  దెయ్యాలు లేవు.  ఒట్టి భ్రమ మాత్రమే నన్న నిర్ణయానికి వచ్చాము.  పబ్లిక్ పరీక్షలుకు బాగా చదివాము.  మంచి మార్కులుతో పాసయ్యాము.  రకరకాల వ్యాపకాల రీత్యా మేమందరం ఉరువిడిచి వెళ్లిపోయాము.  ఎప్పుడైనా మా స్వగ్రామానికి వెళ్ళడం జరిగినపుడు మాకు ఇవన్నీ గుర్తుకువస్తాయి.   గత స్మృతులు ఎంతో మధురంగా వుంటాయి.    మా అనుభవాలు  మా పిల్లలకు చెప్పి ఆనందించడం తప్ప గత కాలాన్ని తీసుకురాలేం  కదా.

0 comments:

Post a Comment