సమయం
రాత్రి 11.00 గంటలు. కావలి
రైల్వే స్టేషన్ లో మూడవ నంబరు ప్లాట్ ఫామ్ పై ప్రయాణికులు రద్దీగా వున్నారు. కొందరు చర్చల్లో మునిగిపోతే మరికొందరు విసుగ్గా
అటూయిటూ తిరుగుతున్నారు. కొందరు దోమలతో కరచాలనం చేస్తుంటే,
ఇవేమీ పట్టనట్టు మరికొందరు కునుకు తీస్తున్నారు.
వీరందరి సమస్యలకు సమాధానంగా
అనౌన్స్ మెంట్ వచ్చింది.
“
యువర్ అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ ఫ్రమ్ చెన్నై టు కాకినాడ సర్కార్ ఎక్స్ ప్రెస్
విల్ అరైవ్ షార్ట్లీ ఆన్ ప్లాట్ ఫామ్ నంబర్
త్రీ “
“
కృపయా ధ్యాన్దే గాడి నంబర్ ఏక్ సాత్ ఛే చార్ తీన్ చెన్నై సే కాకినాడ జానే సర్కార్ ఎక్స్
ప్రెస్ తోడిసేదేర్మే తీన్ నంబర్ ప్లాట్
ఫామ్ పర్ ఆయెగీ”
“
దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ ఒకటి ఏడు ఆరు నాలుగు మూడు చెన్నై నుండి కాకినాడ
వెళ్ళు సర్కార్ ఎక్స్ ప్రెస్ మరికొద్ది
సేపట్లో మూడవ నంబరు ప్లాట్ ఫామ్ నకు వచ్చును”
రైల్వే స్టేషన్ లో అనౌన్స్ మెంట్ విన్న ప్రయాణికులు రావాల్సిన టైమ్ కంటే గంట లేటుగా వస్తున్న రైలు ఎక్కేందుకు
సన్నద్దంకాసాగారు
భానుమూర్తి
కొంత లగేజి తాను తీసుకొని మిగతావి తల్లి శారదమ్మకు చెల్లికి ఇచ్చాడు. ఐదు నిమిషాల్లో వచ్చిన సర్కార్ ఎక్స్ ప్రెస్ లో
సామాన్లన్నీ పై బెర్త్ పై సర్ది క్రింద కూర్చున్నారు. స్టేషన్ నుండి రైలు బయలుదేరింది. ఇంతకాలంగా ఉంటున్న ఊరిని వదిలి
వెళుతుంటే కన్నతల్లిని వదలి
వెళుతున్నట్లుగా దిగాలుగా కిటికీ
వైపు కూర్చొని చూస్తూవుండిపోయింది శారదమ్మ.
రైలు ముందుకు దూసుకు పోతుంటే ఆలోచనలు గతం వైపు మళ్లాయి. . ఇంతవరకు తాను
పడ్డ కష్టాలు, జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుంటే జాలువారుతున్న
కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకోసాగింది
----
ఆ
ఊళ్ళో నారాయణమూర్తి గారంటే తెలియని వారుండరు.
సంపన్నమైన కుటుంబం కాకపోయినా నియమ నిష్టలకు , సాంప్రదాయ
సంస్కారాలకు నిలయం వీరిల్లు. నారాయణ
మూర్తి, వారి సతీమణి
శారదమ్మలు అన్యోన్నంగా పార్వతి పరమేశ్వరులు లాగా వుండేవారు . దేవత లాంటి భార్య తనకు లభించడం అదృష్టంగా
భావించే నారాయణ మూర్తి ఓ ప్రైవేట్ సంస్థలో
గుమాస్తాగిరి చేసేవాడు. తక్కువ జీతమైనా
సర్దుబాటు చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకొచ్చేది శారదమ్మ. చుట్టుప్రక్కల వారికి ఆమంటే గౌరవం. కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినపుడు ఆమె చక్కగా పరిష్కరించగలిగేది.
మేమిద్దరం,
మాకిద్దరు అన్నట్లు వీరికి ఒక కొడుకు ఒక కూతురు . అబ్బాయి భానుమూర్తి అమ్మాయి శ్రీలత చిన్నతనం నుంచే సాంప్రదాయ బద్ధంగా
పెరిగారు. బుద్ధి కుశలతలలోనే కాదు
చదువులోనూ మేటి వీరిద్దరు. యుక్త వయస్సు
కొచ్చిన కూతురుకు ఇరవై వసంతాలు దాటినా ఆర్ధిక ఇబ్బందుల వల్ల సంబంధాలు చూసేందుకు
సాహసించలేదు నారాయణమూర్తి . ఒడిదుడుకుల బ్రతుకు బండిని భారంగా లాగకొస్తున్నా
వయస్సు రీత్యా ఆరోగ్యం సహకరించడంలేదు.
కుమారుడు
డిగ్రీ చేశాడు. పైచదువులుపై దృష్టి పెట్ట లేదు. అందులకయ్యే ఖర్చుల భారం తండ్రి
మోయలేడని తెలుసు. అందుకే ఏదయినా ఉద్యోగం చూసుకొని తండ్రి బాధ్యతలలో భాగం
పంచుకోవాలనుకున్నాడు. కానీ ఉద్యోగం సంపాదించడం అంత తేలికకాదన్న సంగతి తర్వాతగాని
తెలియరాలేదు. కాలేజీలో ఫస్ట్,
పోటీ పరీక్షల్లో మంచి రాంకులు వచ్చినా రిజర్వేషన్ల వల్ల కొన్ని అవకాశాలు పోగా ఇంటర్వ్యూలలో కోరినంత మొత్తం ఇచ్చుకోలేక మరికొన్ని అవకాశాలు
జారవిడుచుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు
శారదమ్మ తరపు బంధువొకరి సహకారంతో విశాఖపట్నంలో ఓ
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించగలిగారు. కానీ
సంవత్సరం తిరగకమునుపే అక్కడే ఒక
అమ్మాయిని కులాంతర వివాహం చేసుకొని
కన్నవాళ్లకు కడుపుకోతను మిగిల్చాడు. కొడుకు చేసిన నిర్వాహం కూతురి జీవితంపై ప్రభావం చూపుతుందనే బెంగ ఆ
దంపతులిద్దరిని నిత్యం క్రుంగదీస్తూనే వుంది.
ఈ విషయం ఆనోట ఈనోట పడి అందరికీ తెలిసిపోయింది. తత్పలితంగా అమ్మాయికి సంబంధాలే రావడం
లేదు. వీళ్ళు కూడా ధైర్యం చేసి ఎవరినీ
సంప్రదించడంలేదు. క్రితంలో అనుకున్న సంబంధం
కూడా వెనక్కు తగ్గారు.
నారాయణ
మూర్తి మునుపటిలా చురుగ్గా పనిచేయడంలేదు.
ఎప్పుడూ ఆలోచనలతో తోటి వారితో ముభావంగా వుండడం చూసి “ నీ పరిస్తితి నాకు తెలుసు మూర్తి గారు. మీ అబ్బాయి చేసింది మీకు తప్పనిపించవచ్చు
గాని ఇప్పుడది సాదారణం. సహృదయంతో సర్దుకుపోవడం తప్ప మనం
చేయగలిగిందేమీలేదు. కాకపోతే మీరు బ్రాహ్మణులు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే
వుండవచ్చు. అయినా వాళ్లిక్కడలేరుగా ఎక్కడో
దూరంగా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు”. అన్న సంస్థ యజమాని మాటలకు
“
నా పెంపకంలో లోపం లేకపోతే వాడలా చేస్తాడా.
అదేదో అమ్మాయి పెళ్లయిన తర్వాత తగలడుంటే మరీ ఇంత వేదన వుండేది కాదు. వాడి
ఇష్టానుసారం తన సుఖం చూసుకున్నాడే గాని తోబుట్టువును గురించి ఆలోచించాడా. ఇంతవరకు
తిన్నా తినకపోయినా పదిమందిలో తలెత్తుకొని తిరిగేవాడిని. కాని ఇప్పుడు తల దించుకొని పోవాల్సి వస్తోంది.
నేను లేక పోయినా వాడు ఈ ఇంటికి ఆసరాగా వుంటాడని ఎంతగానో ఆశించా. నా దురదృష్టం ఇలా
వెంటాడుతుందని అనుకోలేదు. నా బాధంతా మా కూతుర్ని గురించే. ఇలాంటివి జరిగితే మా ఇళ్ళలో సంబంధం చేసుకుంటారా
చెప్పండి. ఇది తెలిసినప్పటినుండి బంధువులు మా ఇంటికి రావడమే మానేశారు.
పెళ్లిళ్లకు, పేరంటాలకు మమ్మల్ని దూరంగాపెట్టారు. అలాంటప్పుడు ఆలోచన
లేకుండా ఎలావుంటుంది చెప్పండి”. చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ చెప్పాడు
నారాయణమూర్తి.
“ ఈమధ్య
కాలంలో లెక్కలన్నీ తప్పుతున్నాయి. లెక్కల్లో తేడాలొస్తే వ్యాపారం దెబ్బతినే
ప్రమాదముంది. నీ పరిస్తితి నేనర్ధం చేసుకోగలను. నీకేమైనా కష్టంగావుంటే చెప్పు ప్రత్యామ్నాయ
ఏర్పాటు చేసుకుంటాను”. గొంతు కోసేముందు
నీళ్ళు చల్లినట్లు చల్లగా చెప్పాడు యజమాని.
తింటున్న
విస్తరిని తీసిపారేసినట్లనిపించింది. వంక
చూపి వద్దుపో అనిపించుకొనేదానికంటే తనకు తానుగా విరమించుకుంటే మర్యాదగా
వుంటుందనుకున్నాడు నారాయణమూర్తి.
ఆ
రోజు రాత్రంతా నిద్రపట్టలేదు. ఉన్న ఉద్యోగం వదలుకుంటే ఇంట్లో గడిచేదేలా. ఉన్న ఇల్లు తప్ప యితర ఆస్తిపాస్తులేవీ
లేవు. పైగా గుండెలమీద కుంపటిలా వయసొచ్చిన
కూతుర్ని ఇంట్లో పెట్టుకొని పనీపాటా లేకుండా ఎలావుంటాం. తన బాధను భార్యతో పంచుకున్నాడు. కన్నీటి పర్యంతమయ్యింది శారదమ్మ. “తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మరెక్కడైనా ప్రయత్నించి చూడండి. అప్పటివరకూ అక్కడే వుంటే బాగుంటుంది. లేకపోతే మనం చాలా ఇబ్బంది పడాల్సి
వస్తుంది” అన్న శారదమ్మ మాటలకు “
సరే” నన్నాడు నారాయణమూర్తి. కానీ కమ్ముకొస్తున్న కారుమేఘాల్లాంటి ఆలోచనలతో కంటిమీద కునుకులేదు కన్నీటి వర్షం
తప్ప.
“
పాల్” అన్న పాలవాడి పిలుపుతో ఆలోచనల సుడిగుండం నుంచి బయటపడ్డాడు నారాయణ
మూర్తి. అప్పుడే తెలవారిపోయిందే అనుకుంటూ
పాలు పోయించుకోవడానికి గిన్నె తీసుకుపోబోయాడు. అప్పటికే శారదమ్మ పాలు పోయించుకుంటోంది. “ ఏమ్మా అబ్బాయి ఎవరో కులం తక్కువ అమ్మాయిని పెళ్లి
చేసుకున్నాడంటగా మీ పిల్లోడు అట్టా చేశాడంటే నమ్మలేక పోయా” అడుగుతున్నాడు పాలవాడు.
గుండెనెవరో పిండినట్లయ్యింది. ఊరంతా
ప్రచారం జరిగిపోయిందన్నమాట. వీళ్ళ
నోటి మాట గడప గడపకూ చేరుతుందని తెలుసు. ఇంతవరకు కొద్దిమందికే తెలుసుననుకున్న ఈ
విషయం అందరి నోళ్లలో నానిందన్నమాట. గాలిని
పిడికిట్లో బంధించాలనుకోవడం మూర్ఖత్వం కాక మరేమిటి? అనుకుంటూ లోనికెళ్ళాడు నారాయణమూర్తి.
మరునాడు యదావిధిగా తాను పనిచేసే సంస్థకు వెళ్ళాడు నారాయణమూర్తి.
“
పంతులుగారూ ఓనరు మిమ్మల్ని ఇక
ఆగిపొమ్మన్నారు. మీబదులుగా వేరే మనిషిని రమ్మని
చెప్పారు. అదిగో ఆ కుర్చీలో కూర్చున్నాడే ఆయనే క్రొత్తాయన”. చెప్పాడు మేనేజరు.
పంక్తిలో
భోజనానికి కూర్చున్నవాడిని లేచిపో అంటే ఎంత అవమానకరంగా వుంటుందో అలా మనస్తాపం చెందాడు
నారాయణమూర్తి. మారు మాట్లాడలేదు. ఇంటికి తిరిగి వచ్చేశాడు. చెప్పకముందే శారదమ్మ పరిస్థితి అర్ధం
చేసుకుంది.
రోజు
రోజుకు పరిస్థితి కష్టంగా మారుతోంది.
నారాయణమూర్తికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంతవరకు దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి కుటుంబ పోషణ
జరిపాడు. క్రమం తప్పకుండా దేవాలయాలకు
వెళ్ళేవాళ్లు దంపతులిద్దరు. దేవుళ్ళకు
మ్రొక్కుకొని ప్రసాదాలు
తీసుకొచ్చుకొనేవాళ్లు.
ఆ
రోజు రాత్రి బాగా ప్రొద్దుపోయాక భర్త దగ్గరకు వచ్చి కూర్చుంది శారదమ్మ. “ఏవండీ ,
మీరు కోప్పడనంటే మీకో విషయం చెబుదామనుకుంటున్నా”.
చెప్పమన్నట్లు
తాలూపాడు నారాయణమూర్తి.
“
ప్రస్తుతం మన పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇక
అప్పులు పుట్టే అవకాశాలు కూడా లేవు. గుళ్ళు, గోపురాలు చుట్టూ ఎన్ని రోజులు తిరిగితే
కడుపు నిండుతుంది. మనమేమైనా
ఫర్వాలేదు. పెళ్లీడు కొచ్చిన పిల్లను
ఇంట్లో పెట్టుకొని ఎంతకాలం ఇలా వుండగలం. అయ్యిందేదో
అయ్యింది. మన అబ్బాయి భానును కొంత డబ్బు సర్దుబాటు చెయ్యమని అడగదాం”.
అన్న శారదమ్మ మాటలకు
ఒక్కసారిగా
ఉరిమిచూశాడు నారాయణమూర్తి.
“
మనల్ని అప్రతిష్ట పాల్జేసి, కష్టాల కుంపట్లోకి నెట్టి , పూటగడవని పరిస్థితి కలగడానికి కారణం వాడు కాదూ. అష్టకష్టాలు పడి చదివించి, అడ్డమైన వాళ్లందరి
కాళ్లుపట్టుకొని ఉద్యోగంలో కుదిర్చితే, ఏరుదాటి తెప్ప తగలేసినట్లు తన సుఖం తాను
చూసుకొని మనకింత అన్యాయం చేస్తాడా. మనసు చంపుకొని వాడ్ని దేహి అని అర్ధించమంటావా.
అంతగా అవసరమైతే నాలుగిళ్లలో అడుక్కొని తెచ్చైనా మిమ్మల్ని
బ్రతికించుకుంటానుగాని ఆలాంటి దౌర్భాగ్యపు పని చెయ్యను” ఖండితంగా చెప్పాడు నారాయణమూర్తి.
కాస్సేపు
మౌనంగా వుండిపోయింది శారదమ్మ. “ ఇంకో
విషయం చెప్పనా, మన ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో
అమ్మాయి పెళ్లి చేద్దాం. మిగిలిన మొత్తాన్ని
ఇంటి ఖర్చులకు వాడుకుందాం. మనమెక్కడైనా
చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని వుందాం”
మళ్ళీ చెప్పింది.
“
నేను అలాగే అనుకుంటున్నా. అంతకంటే పరిష్కార మార్గం నాకు స్పురించడంలే. అలాగే చేద్దాం”
వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయానికొచ్చారు.
నారాయణ
మూర్తి గారి స్నేహితుడికి ఆరు లక్షల
రూపాయలకు ఇంటిని విక్రయించారు. ఇల్లు శారదమ్మ పేరుమీద వాళ్ళ పుట్టింటివాళ్లు
రిజిస్ట్రేషన్ చేయించి ఉన్నందున విక్రయానికి ఎలాంటి అవరోధం ఏర్పడలేదు.
---
శివాలయం సమీపంలో ఒక చిన్న పెంకుటింట్లో అద్దెకు చేరారు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత మొత్తం
ఇంటి ఖర్చులకని ఉంచుకొని మిగతాది బ్యాంకులో వేశారు.
నారాయణ మూర్తి ఓ గుడ్డల షాపులో గుమాస్తాగా చేరాడు. వాళ్లిచ్చే జీతం తక్కువైనా అవసరం కొద్దీ
చేరాల్సి వచ్చింది.
అద్దె
ఇంట్లో చేరి అప్పుడే సంవత్సరం
గడిచిపోయింది. ఆటుపోట్ల జీవితంలో అలజడులు
వస్తూనే వున్నాయి. నారాయణమూర్తి దంపతులు
మానసికంగా శారీరకంగా క్రుంగుతూనే వున్నారు.
ఎట్టకేలకు నారాయణమూర్తి గారి దూరపు బంధువుతో
వియ్యం కుదిరింది. అబ్బాయికి రెండో
పెళ్లి. మొదటి భార్య చనిపోయింది. ఏదో గవర్నమెంట్ ఆఫీసులో అటెండరుగా పనిచేస్తున్నాడు. అసలే సంబంధాలు రావనుకున్న సమయంలో ఇదైనా కుదిరినందుకు కొంత ఊరట లభించింది
వారికి. మీ పరిస్థితి మాకు తెలియందేమీ
కాదు అంటూనే రెండు లక్షలు కట్నం, పది సవర్ల బంగారం,
ఆడపడుచు కట్నం అంటూ అన్నీ డిమాండ్ చేసింది అబ్బాయి తల్లి.
వీటన్నిటికి
కలిపి ఐదు లక్షలు పైగానే అవుతుంది. మరి
పెళ్లి ఖర్చు. ఉన్నది కూడా చాలదు. అప్పు
పుట్టే మార్గం కూడా లేదు. ఆలోచనలో పడ్డాడు నారాయణమూర్తి. “ ఎందుకు సంకోశిస్తున్నావు, డబ్బు విషయమేనా, ఇల్లు
అమ్మిన డబ్బులున్నాయిగా, అమ్మాయి కోసమేగా
వుంచిపెట్టారు. ఇది మంచి అవకాశం. రెండో
పెళ్లనేగాని పిల్లా పీచు బాదరబంధీ లేదు.
పైగా గవర్నమెంట్ ఉద్యోగం. మనం కాదంటే
అవకాశం కోసం కొందరు కాచుక్కూర్చున్నారు.
నువ్వు ఊ అను అన్నీ సవ్యంగా సర్దుకుపోతాయి” సలహా ఇచ్చాడు దగ్గరి బంధువొకాయన.
ఒప్పుకున్నాడు
నారాయణమూర్తి. భర్తకు తెలియకుండా శారదమ్మ
ఈ విషయం కుమారుడికి చేరవేసింది. వీలైతే కొంత ఆర్ధిక సాయం చేయమని కూడా
తెలిపింది. కానీ అందుకు ప్రతిస్పందించ
లేదు భానుమూర్తి. పెళ్లి సాదాసీదాగానే ఒక
గుళ్ళో జరిగిపోయింది.
“
అబ్బాయి ఫర్వాలేదు,
ఎలాగో గుండెమీది బరువు దించుకున్నావోయ్ నారాయణమూర్తీ, ఈ పరిస్థితుల్లో అమ్మాయి పెళ్లి కావడమంటే
మాటలా. ఆ వెధవ చేసిన పనికి ఈ అమ్మాయి బలి
కావలివస్తుందేమిటా భగవంతుడా అని మేము ఎంతో బాధ పడ్డాం.
చివరకి మంచే జరిగింది”. సాంతన
వాక్యాలు పలికాడు అమ్మాయి మేనమామ.
పెళ్ళైన రెండవ రోజునే వచ్చిన బంధువులందరూ
వెళ్ళిపోయారు ఒకరిద్దరు ముఖ్యులు తప్ప. వివాహానంతర కార్యక్రమాలన్నీ సవ్యంగా
జరిగిపోయాయి. అమ్మాయిని అత్తగారింటికి
కాపురానికి పంపారు. శారదమ్మ కూడా తోడు వెళ్ళి
నాలుగురోజులుండి వచ్చింది.
కళ్లెదుట తిరుగాడుతున్న కూతురు లేని కొరత మొదట్లో కొంత బాధించినా క్రమేపీ
అలవాటైపోయింది.
----
జీవితంలో
జరిగిన సంఘటనలు, అనుభవించిన బాధలు గుర్తుకొచ్చాయి
నారాయణమూర్తికి. అమ్మాయి పెళ్ళయి అప్పుడే
సంవత్సరం దాటిపోయింది. కాలం ఎంత వేగంగా పరుగెడుతోంది. ఓసారి అమ్మాయి దగ్గరకు వెళ్లొస్తే బాగుణ్ణు, చూసి చాలా
రోజులైంది అనుకుంటున్న నారాయణ మూర్తికి ఆటో ఆగిన శబ్దం వినపడి అటువైపు చూశాడు. సూట్
కేస్ పట్టుకొని దిగింది కూతురు శ్రీలత.
“
ఇప్పుడే నిన్ను గురుంచి అనుకుంటున్నా.
నూరేళ్ళు ఆయుష్షు . ఒక్కదానివే
వచ్చావేం? అల్లుడు రాలేదా? ఆతృతగా అడిగాడు
నారాయణమూర్తి. శారదమ్మ కూడా ఎదురెళ్లింది
సూట్ కేసు అందుకోవడానికి.
రాలేదంటూ బిరబిరా ఇంట్లోకెళ్లింది శ్రీలత. వెనకాలే వెళ్ళాడు నారాయణమూర్తి. విచార వదనంతో మంచమ్మీద ముఖం త్రిప్పుకొని పడుకుంది.
“ ఏమైందమ్మా ? ఎందుకలా వున్నావు?
మీరేమైనా గొడవపడ్డారా? సందేహంగా అడిగాడు నారాయణమూర్తి.
“ చెప్పమ్మా , ఏంజరిగింది? అడిగింది శారదమ్మ.
“
ఆయన మీరనుకున్నంత మంచివాడు కాదమ్మా. నన్నెప్పుడూ అనుమానిస్తూనే వుంటారు. ఇంట్లోంచి బయటకు
రానివ్వరు. అది ఇల్లు అనేకంటే జైలు అంటే
బాగుంటుందేమో. అప్పుడప్పుడు రాత్రిపూట తాగొస్తారు. పైగా వేరే ఎవరితోనో సంబంధం వుందని
ఇటీవలే తెలిసింది. ఇదేమిటి పరువుతక్కువపని
అనడిగితే, మీ అన్న కులం
తక్కువదాన్ని చేసుకుంటే లేని పరువు ఇప్పుడొచ్చిందా? నేను కాబట్టి నిన్ను చేసుకున్నాను గాని లేకపోతే
పెళ్లికాక ఇంట్లోనే కుళ్లి కుళ్లి చచ్చేదానివంటూ దెప్పిపొడుస్తుంటాడు”.
పెల్లుబుకుతున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పింది శ్రీలత.
“
మరి నేను అక్కడకు వచ్చినపుడు అబ్బాయి గురుంచి అడిగితే బాగానే చూసుకుంటున్నాడని చెప్పావ్ కదా “ అడిగింది శారదమ్మ.
“
అలా చెప్పక ఏంచేసేది? అసలే అన్న చేసిన దానికి కుమిలి పోతున్న మీకు నా
దౌర్భాగ్యపు జీవితాన్ని గురుంచి చెప్పి ఇంకా
క్షోభపెట్టమంటావా ? నా రాత ఎలావుంటే అలా జరుగుతుందిలే
అనుకొని యింతకాలం ఓర్పుతో
సర్ధుకుపోయా. క్షణం క్షణం నిప్పుల కుంపటి
మీద నిలిచే శక్తి నాకులేదు”. అందుకే వచ్చేశా.
“ మరి మీ అత్త మామలు ఏమనలేదా ?
“
నోరెత్తే ధైర్యం వాళ్ళకు లేదు. పైగా
నాపైనే నిందలు మోపుతారు. ముందటి భార్య ఈ బాధలు భరించలేకే ఆత్మహత్య చేసుకుందట. దానికి వీళ్ళు జబ్బుచేసి చచ్చిపోయిందని
చెప్పారట. ప్రక్కింటి పిన్ని చెబితే
తెలిసింది. ఇంకా నాలుగు రోజులు అక్కడే
వుంటే నాకు ఆదేగతి పట్టేది.”
“
అదేంటమ్మా అలా అంటావు,
ఇరుగుపొరుగు వాళ్ళ మాటలు పట్టించుకోబాకు.
మంచి రోజులొచ్చినపుడు అంతా మంచే
జరుగుతుందిలే” సముదాయించింది శారదమ్మ.
నారాయణమూర్తి
గారిలో ఆందోళన మొదలైంది. కూతురి సంసారంలో
సునామీ రాబోతోందని అర్ధమైంది. ఏదైతే
జరగకూడదనుకున్నాడో అదే జరిగింది. ఈ మధ్యకాలంలో కొంచెం ప్రశాంతంగా వున్న
నారాయణమూర్తి గారి ఆలోచనలు మళ్ళీ మేల్కొన్నాయి.
ఇప్పటికిది జరిగింది. మున్ముందు
ఇంకేమీ జరుగుతుందో.
కూతురు
ఇంటికొచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా అల్లుడు ఇంటిముఖం చూడలా. అత్తమామలు కూడా పట్టనట్లు
మిన్నకుండిపోయారు. “ పోనీ నువ్వయినా పోయి
ఏం జరిగిందో కనుక్కొని రారాదూ.” భర్తతో చెప్పింది శారదమ్మ.
“అదీ
నిజమే ఎంతైనా ఆడపిల్లవాళ్లం కదా ఒకసారి
వెళ్లొస్తా. ఏం జరిగిందో తెలుస్తుంది”
మరునాడు
పోయేటప్పుడే చెప్పింది కూతురు. మీరేమీ చేసినా నేను ఆ ఇంటికి పోయేదిలేదని. అయినా పట్టించుకోకుండా వియ్యంకుల వారి
ఇంటికెళ్ళాడు నారాయణమూర్తి . సాయంత్రానికి
తిరిగొచ్చాడు. ఆతృతగా ఎదురెళ్లింది
శారదమ్మ.
“
అమ్మాయి చెప్పినడానికంటే ఎక్కువే అనిపించింది నాకు. వాడికి లేని వ్యసనమంటూలేదు. వాడు సరే, పెద్దవాళ్ళు కూడా మర్యాద తెలియని మనుషులు. పెద్దవాణ్ణి
అంత దూరంపోతే పలుకరింపు కూడా కరువైంది. నన్ను చూసి మొహం చాటేసి
వెళ్ళిపోయారు. ఇక నేనెవరితో
మాట్లాడేది. తిరిగి వచ్చేటప్పుడు దార్లో
మా పరాంకుశం బాబాయి అల్లుడు సతీష్
కనపడ్డాడు. మనమెంత దాచినా దాగదు కాబట్టి
వాడికి జరిగిందంతా చెప్పా”. శారదమ్మ అడగకముందే చెప్పాడు
నారాయణమూర్తి.
“
మరి సతీష్ ఏమన్నాడు?
“
ఇంకేమంటాడు. వాడికి పిల్లనివ్వడమంటే చేతులారా
విషమిచ్చి చంపుకోవడమే. అయినా
తెలివితక్కువ తనం కాకపోతే మమ్మల్ని
అడిగుంటే అన్నీ వివరాలు చెప్పేవాళ్లం గదా.
వాడి వెధవ వేషాలు లోకమంతా తెలుసు మీకు తప్ప. పెళ్లికి మేము రాలేదు కాబట్టి వరుడు ఫలానా అని తెలియదు. వచ్చుంటే అప్పుడే వాడి బండారం
బయటపెట్టేవాడ్ని. ఇప్పటికైనా మీ అమ్మాయిని
పంపొద్దు. లేకపోతే వాడి మొదటి పెళ్ళానికి పట్టినగతే పడుతుంది” అని చీవాట్లు పెట్టి పంపాడు.
నారాయణమూర్తి గారి మాటలతో
హతాశురాలయ్యింది శారదమ్మ. కడుపు
చించుకొని పుట్టిన ఇద్దరు బిడ్డలు గుండె కోతలు పెడుతుంటే తన ధౌర్భాగ్యపు
జీవితానికి భగవంతుని నిందించక తప్పలేదు.
కాలగమనంలో
మరో మాసం గడిచిపోయింది.
“
పోస్ట్ “ వాకిటముందు నిలబడి అరిచాడు
పోస్ట్ మన్. కొడుకు దగ్గరనుంచి ఉత్తరం
వచ్చిందేమో నన్న ఆశతో బిరబిరా వెళ్లింది
శారదమ్మ.
“ శ్రీలత పేరున
రిజిస్టర్ పోస్ట్ వుందమ్మా”
“
ఎక్కడనుంచి? ఆందోళనగా అడిగింది
“
గూడూరు నుంచి. ఆమెను పిలవండి రశీదు మీద
సంతకం పెట్టాల”. పోస్ట్ మన్ మాటలు విన్న
శ్రీలత వచ్చి సంతకం చేసి రెజిస్టర్డ్ కవరు తీసుకుంది.
నారాయణమూర్తి షాపులో పనికెళ్ళాడు. ఇక
రాత్రికిగాని ఇంటికి రాడు . కవరు చించి చూసిన శ్రీలత; అల్లుడు పంపిన విడాకుల నోటిస్ గురుంచి తల్లికి
చెప్పింది.
ఉన్నట్లుండి పిడుగుపడినట్లు భీతిల్లలేదు
శారదమ్మ. జరగబోయేదేదో ముందుగా ఊహించిందే
కాబట్టి ఆందోళన చెందకుండా యదాలాపంగా
ఉండిపోయింది.
రాత్రి షాపునుండి ఇంటికి వచ్చిన
నారాయణమూర్తి భోజనం ముగించి పడుకోబోయేముందు ఉత్తరం విషయం బయటపెట్టింది
శారదమ్మ.
నారాయణమూర్తి
కూడా మౌనంగా విన్నాడు. ఇది ముందే
ఊహించింది కాబట్టి మారు మాట్లాడలేదు.
గుంబనంగా కుమార్తె వైపు తదేకంగా
చూస్తూ ఉండిపోయాడు. తలుపులు తెరుచుకున్న ఆలోచనలు మెదడ్ని తొలిచేస్తున్నాయి. ఈ స్థితికి తొలి మెట్టయిన కొడుకంటే ద్వేషం,
స్వార్ధంతో తమ జీవితాలతో ఆడుకునే వ్యక్తులున్న ఈ సమాజమంటే ద్వేషం. ఆర్తులకు, అభాగ్యులకు, అనాధలకు అండగా వుండలేని ఆ దేవుదంటే ద్వేషం. బ్రద్దలయ్యేందుకు సిద్దంగావున్న అగ్ని పర్వతంలా
మనసు కుతకుతా ఉడుకుతోంది. అడుగంటిన
కన్నీళ్ళకు పెల్లుబికే శక్తిలేదు. రగులుతున్న వేడికి కునుకు కూడా కంటికి
దూరమయ్యింది.
మాట
పలుకు లేకుండా నిశ్చేష్టంగా వున్న భర్తను చూసి శారదమ్మకు ఏదో సందేహం కలిగింది. భర్త
ప్రక్కనే కూర్చుని ఆలోచనల్లో పడింది.
కొంతసేపటికి కునుకు కమ్మేసింది . అలా ఎంతసేపు వుందో తెలియదు. ‘దబీ’ మని శబ్దం వినబడేసరికి ఉలిక్కిపడి లేచింది. నారాయణమూర్తి
మంచమ్మీదినుంచి క్రింద పడిపోయాడు.
“
ఏవండీ, అంటూ పెద్దగా అరుస్తూ ఒక్క ఉదుటున లేచి భర్తను లేవదీయబోయింది.
కానీ తనవల్లకాలేదు. ఆ అరుపుకి కూతురు లేచి
పరుగెత్తింది. ఇద్దరు ఎలాగో మంచమ్మీద
పడుకోబెట్టగలిగారు. నారాయణమూర్తి కుడి కాలు కుడి చేయి గింజుకుంటున్నాయి. ఏదో చెప్పాలన్న ప్రయత్నం నిష్ఫలమవుతోంది. మూతి
వంకర పోతోంది. భార్య, కూతురి వైపు దీనంగా చూస్తున్న
కళ్లనుండి నీరు ధారగా కారుతోంది. శారదమ్మ, శ్రీలత లు ఏడ్వడం విని ఇరుగు పొరుగు వాళ్ళు పరుగు పరుగున వచ్చారు.
“
అయ్యో పెరాల్సిస్ అటాక్ అయినట్లుందే. అంటూ
ఆఘమేఘాల మీద హాస్పిటల్ కు
తీసుకెళ్లారు. శారదమ్మ పరిస్థితి తెలిసిన
వాళ్ళు కాబట్టి ఎవరికి తోచిన సాయం వాళ్ళు
చేశారు. ఆపద సమయంలో సహాయం చేసినందుకు మీ మేలు మరచిపోలేనంటూ
కృతజ్ఞతలు తెలిపింది శారదమ్మ.
“
శారదమ్మా పట్టింపులకు పోకుండా ఇప్పుడైనా
మీ కొడుకుని పిలిపించుకోకూడదూ. అన్నిటికీ
ఆసరాగా వుంటాడు. హాస్పిటలంటే మాటలా. డబ్బుతో కూడిన వ్యవహారం. ఇప్పుడేగా
డాక్టర్ చెప్పాడు, కనీసం వారం రోజులైనా హాస్పిటల్లో
వుండాలని. మేమంటే పని సాయం, పలుకు సాయం చేయగలవారమే గాని డబ్బు సాయం
ఎంతమందిమి చేస్తాం, ఎంతని చేస్తాం. నా మాటవిని
నే చెప్పినట్టు చెయ్. అన్ని
సమస్యలు పరిష్కారమవుతాయి.” సలహా ఇచ్చాడు
తమకు చేదోడు వాదోడుగావున్న ప్రక్కింటి నరసింహయ్య.
నిజమే,
నరసింహయ్య చెప్పిందే మంచి ఆలోచనగా తోచింది శారదమ్మకు. వాళ్లనాన్నకు జబ్బు చేసిందంటే మనసు నిలవదు.
ఆఘమేఘాల మీద వస్తాడు. ఆశ ఆల్చిప్పయ్యింది. వెంటనే నరసింహయ్య చేతనే పరిస్థితి తెలుపుతూ
కొడుక్కి ఫోను చేయించింది. ఫోనులో
అవతలివైపు నుండి ఆడ గొంతు వినపడుతోంది.
“
నేను ఆయన భార్యను మాట్లాడుతున్నా,
ఆయన వచ్చేందుకు వీలు లేదు.
ఆఫీసులో ఇక్కడ చాలా ముఖ్యమైన పనులున్నాయి. మీకు మరీ అంత అవసరమైతే ఎవర్నైనా పంపితే డబ్బులు పంపుతాం “ ఫోను పెట్టేసింది భానుమూర్తి భార్య,
వర్షించని
మేఘాలు ఎన్ని కమ్ముకున్నా మాత్రం ఉపయోగమేముంది.
తన కొడుకు ఎంతగా బంధీ అయ్యాడో
శారదమ్మకు అర్ధమైంది. ఇక వాడిపై ఆశలు పెట్టుకోవడం వ్యర్ధమనిపించింది. తాను ఏంచేయాలన్న విషయమై ఒక నిక్షితాభిప్రాయానికొచ్చింది.
“
నరసింహయ్యా, మాకో సాయం చేసిపెడతావా.
హాస్పిటల్ ఖర్చులకు మా దగ్గర డబ్బులు లేవు. ఇంతవరకు మీరు ఇచ్చిన వాటితో
సరిపెట్టా. అమ్మాయి నగలున్నాయి. అవెక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చివ్వమని
అడిగింది శారదమ్మ.
శారదమ్మ ఇచ్చిన నగలు తాకట్టు పెట్టి నరసింహయ్య తెచ్చి యిచ్చిన డబ్బు హాస్పెటల్ ఖర్చులకు పోగా
మిగిలింది తదుపరి అవసరాలకు వుంచుకుంది శారదమ్మ.
వారం రోజులు తర్వాత నారాయణమూర్తిని
హాస్పెటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. కుడి
కాలు, కుడి చెయ్యి, నోరు ఇక రావని తేల్చేశారు.
కన్న బిడ్డే కాదు కాలు చెయ్యి కూడా కాదనుకొని కదలలేని స్థితికొచ్చినందుకు
నారాయణమూర్తి కుమిలిపోసాగాడు. కొందరైతే నాటు మందులు వాడమని ఎందరో వైద్యులను
సూచిస్తూ సలహాలిచ్చారు. దేనికైనా డబ్బే ప్రధానం. రోజులు గడుస్తున్నాయి.
నిన్న
మొన్నటి వరకైతే నారాయణమూర్తి అంతో ఇంతో తెచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. మరి నేడో, అదీలేదు.
కుటుంబ పోషణకే కాదు, వైద్య ఖర్చులకూ డబ్బు అవసరం. కూతురికి పెట్టిన నగలు ఒక్కొక్కటిగా
అమ్మివేయసాగారు. ఆ డబ్బు ఎంతకాలం
సరిపోతుంది. ఆ తర్వాత పూట గడవటమెలా ? సమస్యలన్నీ శారదమ్మ మెదడుని
తొలుస్తూనే వున్నాయి. ఇప్పుడే జరుగుబాటు కష్టంగా వుంది. ఎక్కడైనా పనికి కుదిరితే. తాను ఏం పని చేయగలదు. ఇంటిపని, వంటపని తప్ప. ఇక్కడే ఎక్కడైనా
పనికిపోతే, నామూషీగా వుండదూ. అందుకే వేరే ఊరెళ్ళి బాగా డబ్బున్న వాళ్ళింట్లో పనిమనిషిగానైనా
కుదిరితే బావుణ్ణు. ఆలోచనల్లో
మునిగిపోయింది శారదమ్మ.
“
అమ్మా,” అన్న పిలుపుతో
ఆలోచనల నుండి బయటపడింది.
వాకిట్లో
చాకలి సుబ్బన్న గుడ్డలమూట దించుకుంటూ నిలబడున్నాడు.
“ పంతులుగోరికి పచ్చవాతం వచ్చిందంటగదమ్మా.
నిన్ననే మావూరాయన చెబితే తెలిసింది. ఆస్పత్రిలో సూసెడంటా. పాపం ఎట్టజాస్తారో ఏమో. కష్టాలన్నీ ఒకదానిమిందొకటి వస్తావుంటే
మడిసేమికోలుకుంటాడు. గబగబా గుడ్డలు
చేసుకొని తెచ్చా”. చెబుతున్నాడు సుబ్బన్న.
సుబ్బన్న
చాకలి పనేకాదు అవసరమైతే వీళ్ళు పురమాయించే ఇతరత్రా పనులు కూడా చేసిపెడుతుండేవాడు.
నమ్మినబంటు. ఇతరులెవ్వరిని లోనికి అనుమతించక పోయినా సుబ్బన్నకు మాత్రం
ఎలాంటి ఆటంకముండదు. ఇల్లంతా తానై
తిరుగుతాడు. ఆకలైతే అడిగిమరీ
పెట్టించుకొని తింటాడు. ఒట్టి అమాయకత్వం.
చదువు లేకున్నా మంచి స్వభావముంది.
పరోపకార బుద్ధుంది. నారాయణమూర్తి
వాళ్ళ తండ్రి కాలం నుంచి వీళ్ళ తాత తండ్రులు గుడ్డలుతికేవారు. దానిని పోనివ్వకుండా సుబ్బన్నకూడా వీరింటి
చాకలయ్యాడు.
సుబ్బన్న
బాధపడుతూ అన్న మాటలుకు శారదమ్మ కళ్ళు చెమర్చాయి.
‘మేము బాధల్లో వున్నామని గుడ్డలుతికినందుకు తనకు రావలసిన
డబ్బులు కూడా అడిగేవాడు కాదు.
మమ్మల్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.
కన్న కొడుకు కంటే సుబ్బన్నే
మనసున్నోడు ’
అనుకుంటూ;
“
ఏం సుబ్బన్నా ఈ మధ్య కనపడటమే మానేశావ్,
అంతకుముందు వారానికొకసారైనా కనపడేవాడివి. ఎక్కడికెళ్తున్నావ్? పనులెక్కువగా వున్నాయా ? అడిగింది శారదమ్మ.
“ ఆ, ఏం
పనుల్లేమ్మా, మా ఊరి
రెడ్డిగోరింట్లో కర్మంత్రం వచ్చింది. అది
నా చావుకే వచ్చినట్టుంది .
“ ఏ మైంది ?
“
ఆ ఇంట్లో ముత్తైదు చచ్చిపోయింది.
కర్మంత్రం రోజు బాపన ముత్తైదుని తీసుకోరావాలంటా. ఇంతకుముందు వచ్చే ఆమె ఊళ్ళో లేదు ఎక్కడికో
బొయ్యింది. పురోయితుడు నా వల్లకాదని చెప్పేసేడు. ఇంకెవురూ దొరకలా. ఆ ఇంటి చాకలోడ్ని అయినందుకు
నాకు పని బెట్టారు. మూడు రోజుల్నుంచి తిరగలేక సస్తుండా. ఈలోగా పంతులుగోరిని సూసిపోదామనొచ్చా” చెప్పాడు సుబ్బన్న.
చూడవచ్చిన
సుబ్బన్నను కన్నీళ్లతో పలకరించాడు నారాయణమూర్తి. అలా జరిగిన పరిస్థితులు శారదమ్మ చెబుతుంటే వింటూ
కొంచెంసేపు అక్కడే గడిపాడు సుబ్బన్న.
“ బ్రాహ్మణ ముత్తైదువకు ఏం చేస్తారు? అలా వచ్చినందుకు ఏమిస్తారు? అడిగింది శారదమ్మ
“
పెద్ద కర్మ రోజు పిండం బెట్టబోయేముందు బాపన ముత్తైదుకి కొత్త కోక కడతారు,
కాళ్ళకి, మొకానికి పసుపు పూస్తారు, కొత్త
గాజులు తొడగతారు, తలనిండా పూలు పెట్టి సింగారిస్తారు. కొత్త చెప్పులు
తొడుక్కొమంటారు, కొత్త చేట, బియ్యం
అన్నీ ఇచ్చి సచ్చిపోయినామెను పంపించినట్లు మంగళ
మేళంతో కొద్ది దూరం సాగనంపుతారు. ఇంక ఆమె అక్కడనుండి అటే ఎల్లిపోద్ది. అంతే”
“
అలా చేసినందుకు ఆమెకు ఏమిస్తారు ? అన్న శారదమ్మ మాటలకు
“
ఎందుకు లేదూ , ఎయ్యి రూపాయలు పైనే యిస్తారు.
పెద్దోళ్లైతే ఇంకా ఎక్కువే “ చెప్పాడు సుబ్బన్న.
ఈ
రోజుల్లో అలాంటి వాళ్ళు దొరకాలంటే కష్టమే.
కాలం మారిపోయింది. వాటికెవరూ
ముందుకు రావడంలేదు. పాపం నువ్వు ఎలా
చేస్తావో ఏమో నన్న శారదమ్మ మాటతో
“నేను
పోతుండానమ్మా ఏడన్నా
తిరిగి బాపనమ్మోరుని సూడాల. మళ్ళీ నాలుగు
రోజుల్లో వస్తాలే.” బయల్దేరాడు సుబ్బన్న.
వీధి
గుమ్మందాకా వెంట నడిచిన శారదమ్మ, “నువ్వింతగా
కష్టపడుతున్నావు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళింట్లో ఒకామె వుంది. ఆమె అప్పుడప్పుడూ ఇలాంటివాటికి పోతుంటుంది. కావాలంటే మాట్లాడి ఏర్పాటు చేస్తా”. ననిచెప్పింది.
“
అమ్మా, నీకు పుణ్యం వుంటది
ఆపని చేసిపెట్టు ,
వచ్చే బేస్తవారం 15 వ తేదీ
కరమంత్రం.
“
సరేలేరా అలాగే ఏర్పాటు చేస్తాలే,
రేపో మాపో వచ్చి విషయం కనుక్కొనిపో”
శారదమ్మ
ఇచ్చిన భరోసాతో గండం
గడిచినట్లైయ్యింది. సమస్య తీరినందుకు
సంతోషంతో ఇంటి ముఖం పట్టాడు సుబ్బన్న.
మరునాడు
వచ్చి విషయం నిర్ధారణ చేసుకున్నాడు సుబ్బన్న. ఎక్కడకి రావాలో ఎన్నిగంటలకు రావాలో
వివరంగా చెప్పాడు. రెడ్డి గారికి కూడా తాను కష్టపడి
సాధించుకొచ్చానని, పని ఖాయమైనట్లు గొప్పలు పోతూ చెప్పాడు.
----
కర్మంత్రము
రోజు రెడ్డి గారింట్లో హడావిడిగా తిరుగుతూ
ఆపని ఈ పని చేస్తున్న సుబ్బన్నకు మనసులో ఏదో సందేహం. ఇంతకీ బాపనమ్మోరు వస్తాదా. రాకపోతే పదిమందిలో పరువు పోయినందుకు రెడ్డి
నన్ను సంపేస్తాడు. మనసులో మదనపడసాగాడు.
“
పది గంటలు కావస్తోంది. బాపనమ్మోరేదిరా”, అడిగాడు
పురోహితుడు.
“
వచ్చుంటది , రేవుకాడికొచ్చుంటది స్వామీ”
సమాధానం చెప్పేడేగాని
సుబ్బన్నకు కలవరం ఎక్కువైంది. పరుగు పరుగున రేవుకాడికి పోయాడు. అక్కడ ఎవ్వరూ కనపడలా. కొంచెం దూరంలో చెట్టు క్రింద ఎవరో ఒకామె
కూర్చునివుంది. ఆమే అయ్యుంటదని దగ్గరి
కెల్లాడు. తన కళ్ళను తానే నమ్మలేని
స్థితి. శారదమ్మ సుబ్బన్నను చూసి పేలవంగా
నవ్వింది.
“
బాపనమ్మోరిని తీసుకొచ్చినావా అమ్మా, ఏది ఎక్కడుంది? అయినా యిట్టాంటి చోటకి నువ్వేందుకొచ్చినావు.” ఆతృతగా అడిగాడు సుబ్బన్న.
“
లేదురా ఆమె బదులు నేనే వచ్చా”. సుబ్బన్న
ముఖంలోకి సూటిగా చూడలేక తల దించుకొని
చెప్పింది.
“
మరి ఆమేమయ్యింది ?
“
ఆమె వుంటేగా రావడానికి. నీకలా
చెప్పానంతే. ఇంట్లో పరిస్థితి నీకు
తెలియందేమీ కాదు. ఇంతకంటే మార్గం తోచలా
నాకు. ఇంట్లో వాళ్ళకీవిషయం తెలియదు. నువ్వుకూడా చెప్పొద్దు. సాయిబాబా గుడిలో పూజలు జరుగుతున్నాయి
పోయొస్తానని చెప్పి ,
అమ్మాయిని ఆయన దగ్గరుంచి ఇటొచ్చా.
వచ్చానే గాని భయం భయంగా వుంది.
ఇలాంటి విషయాలు నాకు తెలియవు.
నువ్వే ఎలాగో సర్దుబాటు చెయ్”
ప్రాదేయపడుతూ చెప్పింది శారదమ్మ.
సుబ్బన్న
కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇట్టా జరుగుతుందనుకుంటే
ఇంకెవరినైనా పిలుచుకొచ్చేవాడ్ని. సీతమ్మ తల్లి లాంటి శారదమ్మకు
భగవంతడు ఎందుకింత అన్యాయం చేస్తుండాడు. మనసులో దేవుని నిందించాడు.
జంగం దేవర గంట వాయిస్తూ శంఖు నాదం చేస్తుండగా,
కర్మ చేసే వ్యక్తి పిండాన్నం భుజాన మోసుకొని బంధు మిత్ర పరివారంగా రేవు వద్దకు వచ్చారు.
అనువైన చోట శిలలు ఏర్పాటు పిండప్రదాన కార్యక్రమం ప్రారంభించారు.
“
ముందర ముత్తైదువను అలంకరించి ఆ ఏర్పాట్లెవో చేయండి” చెప్పాడు పురోహితుడు .
ఇంటి
వద్దనుండి వచ్చిన వారిలో ముగ్గురు ముత్తైదువులు
కర్మ స్థలానికి కొంచెం దూరంలో శారదమ్మను కూర్చోబెట్టి కాళ్ళకు,
ముఖానికి పసుపు పులిమారు. నుదుటిన పెద్ద
కుంకుమ బొట్టు పెట్టారు. చేతుల నిండా
గాజులు తొడిగారు. జడలో కుప్పలా పూలు
తురిమారు. క్రొత్త చెప్పులు తొడిగారు.
క్రొత్త చీర కట్టబెట్టారు. ఇవన్నీ
చేస్తున్నంతసేపు జీవఛ్ఛవంలా వుండిపోయింది శారదమ్మ.
ఇలా
వచ్చి పొరపాటు చేశానా ? మదనపడసాగింది.
అలంకరణ
అంతా అయింతర్వాత. పూలు, పండ్లు, తాంబూలం, బియ్యం , అన్నీ
చీర ఒడిలో పెట్టారు,
క్రొత్త చేట, ఇవ్వాల్సిన డబ్బులు చేతికిచ్చి
కొందరు మహిళలు మంగళ వాయిద్యాలతో పదడుగులు దూరం వెంట వచ్చి సాగనంపగా
ముందుకుసాగింది శారదమ్మ. సుబ్బన్నను తోడుగా స్టాండ్ వరకు పంపించారు.
“
సచ్చినామె కంటే ఈమే బాగుందిరా. ఈ రెడ్డి కి పెళ్ళాం పోయిందని బాధెందుకు. ఈ అమ్మోరిని సెటప్
సేసుకుంటేపోలా” వెనకనుంచి ఎవరో మందు బాబుల
మాటలు గునపాల్లా గుచ్చుకున్నాయి.
దారిలో ప్రక్కనేవున్న తోటలో బావి వద్ద స్నానం
చేసి గుడ్డలు మార్చుకొని యధాప్రకారంగా తయారైంది.
తనకు ఇచ్చినవన్నీ గుడ్డలతోపాటు సుబ్బన్నకిచ్చేసింది డబ్బు తప్ప. గండం గడిచినట్లు గబగబా స్టాండ్ వైపు కదిలింది.
“
అమ్మా జాగర్త, రేవుకాడ
నేనుండాల. పోతుండా” సెలవు తీసుకొని వెనుతిరిగాడు సుబ్బన్న.
----
మధ్యాహ్నం దాటుతోంది.
తమ ఇంటికి కొద్ది దూరంలో ఆటొ దిగి వడివడిగా ఇంటికి చేరింది శారదమ్మ.
ఇంటికొచ్చిన శారదమ్మను తదేకంగా చూడసాగారు భర్త,
కూతురు. శారదమ్మలో ఏదో తత్తరపాటు. వాళ్ళ
ముఖాలను సూటిగా చూడలేకపోయింది. వీళ్ళకి నిజం తెలిసిపోయిందా. లేకపోతే నన్నెందుకు అదోలా చూస్తున్నారు. అడిగితే ఏమని చెప్పాలి. శారదమ్మలో కలవరం మొదలైంది.
“ ప్రొద్దున్నే గుడికేళ్లొస్తానని పోయి ఇప్పుడా
రావడం. ఇంకా రాలేదేమని ఎంత ఆందోళన పడ్డామో
తెలుసా, నాన్న నీకోసం ఎదురు
చూస్తున్నాడు. అన్నం పెట్టబోయినా తినలా.” అడిగింది శ్రీలత. “గుడి నుంచి వచ్చేటప్పుడు దారిలో తెలిసిన
వాళ్ళు కనపడితే మాట్లాడుతూ ఆలస్యమైపోయింది”.
తప్పుకొనేందుకు ఏదో సమాధానం చెప్పింది శారదమ్మ.
“
నుదుటున బొట్టేది?
పాదాలకు పసుపు అంటుకున్నదేంటి ? అసలు మనిషివే
చిందరవందరగా అదోలా వున్నావేంటి ? ఎక్కడయినా పేరంటానికి పోయావా? సందేహంగా అడిగిన కూతురి మాటలకు
“ముందు మీనాన్నకు భోజనం వడ్డించు తర్వాత తీరికగా మాట్లాడుదువుగాని” అని విసుక్కుంది శారదమ్మ.
శారదమ్మ
వాలకం ఏదో అనుమానాస్పదంగా తోచింది నారాయణమూర్తికి. కూతుర్ని ఎప్పుడూ అలా విసుక్కోలా. ఏదో జరిగింది. ఈ కలవరపాటు చూస్తుంటే మా దగ్గరేదో
దాస్తున్నట్లుంది. దేవుడు చిన్న చూపు
చూసినందువల్ల నాకీగతి పట్టింది. కదలలేని స్థితిలో అందరికీ భారమైపోయా. నారాయణమూర్తి
మనసులో వేదన వేగిస్తోంది.
సాయంత్రం వంట
చేస్తుండగా తమ బంధువు సుందరమూర్తి
అటువైపు వెళుతూ లోనికొచ్చాడు. “ఏమోయ్ నారాయణ ఆరోగ్యమెలావుంది? రోజూ వస్తామనుకుంటాను,
ఎదోపని నెత్తిమీదికొచ్చి కూర్చుంటుంది. రాలేకపోతాను. అవునూ శారద మధ్యాహ్నం ఎక్కడినుంచో ఆటొలో రావడం
చూశా. ఎవూరెళ్లింది.?
అర్థంకానట్లు
చూస్తుండిపోయాడు నారాయణమూర్తి. శారదమ్మ
వంటపనిలో నిమగ్నమైవుంది. “ సాయిబాబా
గుడికెళ్లింది. రావడం ఆలస్యమయ్యేసరికి ఆటొలో వచ్చుంటుంది” వరండాలోనుండి వస్తూ చెప్పింది శ్రీలత.
“
అదేమిటమ్మా, సాయిబాబా గుడి వుండేది
దక్షిణం వైపు ఊరి చివరన. ఆమె వచ్చింది
ఉత్తరం వైపు నుండి” సందేహంగా అడిగాడు
సుందరమూర్తి. అర్ధంగాక
తండ్రీ కూతుళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
“
సరే నేను పోయివస్తాను. అర్జంట్ పనివుంది,
ఇంకొకసారి వస్తాలే. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో.”
నిష్క్రమించాడు సుందరమూర్తి.
సుందరమూర్తి
చెప్పినదాంట్లో నిజముందనిపిస్తోంది. మధ్యాహ్నం అమ్మ తీరుకూడా ఎదోలా వుంది.
మనిషిలో ఏదో మార్పు,
కలవరపాటు,
ఏమయ్యుటుంది ?
ఆలోచనలో పడింది శ్రీలత.
ఇంతలో
పాత ఇంటి దగ్గర తమతో కలివిడిగా ఉన్న లక్ష్మి పిన్ని వచ్చింది. “ లతా మీ అమ్మ ఎక్కడికెళ్లింది?
సాయిబాబా గుడికొస్తానని చెప్పింది. మధ్యాహ్నం దాకా గుడి దగ్గర చూసి చూసి తిరిగి వచ్చేశా”
ఆ
మాటలు శారదమ్మ చెవిన పడ్డాయి. “ లక్ష్మీ
ఇలా రా “ క్షణం ఆలస్యం
చేయకుండా వంటగదిలోకి పిలిపించుకుంది ఆ సంభాషణను పొడిగించనీయకుండా.
స్నానాల గది దగ్గర
గుసగుసలాడింది సంజాయిషి చెప్పుకుంటున్నట్లుగా. మాటున విన్న శ్రీలత ముఖ కవళికలు
మారిపోతున్నాయి. మాకు తెలియకుండా
దాచవలసినంత రహస్యమేమిటి? మెదడుని పురుగు తొలుస్తున్నట్లుగా
వుంది. వచ్చిన లక్ష్మి వెంటనే
వెళ్లిపోయింది.
రాత్రి
ప్రొద్దుపోయేంత వరకు శ్రీలతకు నిద్ర
పట్టలేదు. ఎలాగైనా తెలుసుకోవాలని
తల్లిని నిలదీసింది. పుట్టి బుద్ధెరిగినప్పటినుండి ఎప్పుడూ తల్లిని ఎదిరించలేదు,
ఏవిషయంలోనూ ప్రశ్నించలేదు. కానీ, అనుమాన నివృత్తి కోసం నిలదీయక
తప్పలేదు. “ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎక్కడికెళ్లావమ్మా ?
మాతో ఎందుకు అబద్దం చెప్పావు, ఏ తప్పూ చేయకపోతే ఎందుకా కలవరపాటు, దాపరికం” ప్రశ్నించింది. మనసులో అనుమానం, ఆవేశం
అగ్ని పర్వతంలా రగులుతుంటే నారాయణమూర్తి మాత్రం కూలిన వృక్షంలా
మిన్నకుండిపోయాడు.
ఇక
లాభం లేదనుకుంది శారదమ్మ. ‘ఎవరి వల్లా పైసా సంపాదనలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. పక్షవాతం వచ్చిన భర్తను, భర్తను వదిలేసి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని జరుగుబాటు కస్టమయిందన్న సంగతి
వీళ్ళకు తెలియదా. ఆత్మాభిమానాన్ని కూడా
చంపుకొని, అవమానకరమైన పరిస్థితినెదుర్కున్నది వీళ్ళకోసం కాదా. సాంప్రదాయానికి విరుద్దంగా ప్రవర్తించానేమోగాని, సచ్ఛీలతకు ఎలాంటి మచ్చ తేలేదు. అక్కడ
ఇచ్చిన వాటితో పది రోజులు కుటుంబ పోషణ జరుగుతుందని ఆశపడ్డానుగాని, ఇలా అనుమానాలకు, అవమానాలకు దారితీస్తుందనుకోలేదు’ మనసులోని మాటల మూటను విప్పింది శారదమ్మ
ఉప్పొంగిన కన్నీటిని తుడుచుకుంటూ. భానును సాయం
కోరదామంటే, ఈయనేమో
పరువు ప్రతిష్ట అంటూ పీకలు కోసుకుంటూ
వుంటాడు. పూట గడవడానికి పనికిరాని పరువు ప్రతిష్ట లెందుకు. నన్నెలా చావమంటారో చెప్పండి? రోదిస్తూ ప్రశ్నించింది.
శారదమ్మ మాటలతో ఇల్లంతా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. తన
పేదరికాన్ని అపహాస్యం చేస్తూ జరిగిన సంఘటనలు తన అశక్తతను గుర్తుచేస్తున్నట్లుగా
వుంది. ‘ అవును శారద
చెప్పిందాంట్లో, చేసిందాంట్లో తప్పేముంది? ఛాందస బురఖా తొలగించి ఆలోచించాడు నారాయణమూర్తి. కులం కూడుపెట్టడంలేదు,
కాపురం నిలబెట్టలేదు’ ఒక్కసారి కన్నకొడుకుని కళ్ళారా
చూడాలన్న కోరిక కూతురికి తెలియజేశాడు. పొద్దున్నే ఫోను చేస్తాలేనని ప్రక్కమీదికి
చేరుకుంది శ్రీలత.
తెల్లవారగానే
కాఫీ కలిపి “ మీ నాన్నకు ఇచ్చిరావే” అంటూ శ్రీలత చేతికి కాఫీ గ్లాసునందించింది
శారదమ్మ.
నాన్న
ఇంకా నిద్రలేవలేదే అనుకుంటూ కాఫీ ఇచ్చేందుకు
లేపబోయింది శ్రీలత. నారాయణమూర్తిలో
చలనం లేదు. భయంతో అమ్మను
పిలిచింది. చూడగానే జరగరానిది
జరిగినట్లు అర్ధమయింది శారదమ్మకు. ఏడుస్తూ
ప్రక్కింటి వాళ్ళను పిలిచింది.
బిలబిలమంటూ చుట్టుప్రక్కలవాళ్లు
వచ్చి చనిపోయినట్లుగా నిర్ధారించారు. శవ
ఖర్చులకు తనవద్దనున్న డబ్బులిచ్చింది
శారదమ్మ. నిన్న తెచ్చిన డబ్బులు ఇలా ఉపయోగపడ్డాయని తలుచుకుంటూ కుళ్లి కుళ్లి ఏడ్వసాగింది.
ఫోను
నంబర్లు తీసుకొని బంధు మిత్రులందరికి ఈ విషయం తెలియజేశారు ఇరుగు పొరుగు వాళ్ళు. ఈ
సారి ఫోను కొడుకే రిసీవ్ చేసుకున్నాడు.
వెంటనే బయలుదేరి వచ్చాడు. కొడుకుని
చూసిన శారదమ్మకు కన్నీటి వరద ఆగలేదు. ఇలా కొరివి పెట్టించుకొనేదానికేనేమో నిన్ను చూడాలని పిలిపించమన్నారాయన అంటూ రోదించసాగింది. చాకలి సుబ్బన్నను పిలిపించారు. శారదమ్మను చూసిన సుబ్బన్న కన్నీటి
పర్యంతమయ్యాడు. నిన్న ముఖం నిండా పసుపు
పూసుకొని నుదుటిన కుంకుమ బొట్టు, తలలో పూలు పెట్టుకున్న నిండు ముత్తైదువ తన కళ్ళలో మెదులుతూనే వుంది.
కర్మ
క్రతువులు అన్నీ అయిపోయాయి. తల్లిని
చెల్లిని తనతో రమ్మని పిలిచాడు భానుమూర్తి.
అంతకంటే గత్యంతరం లేదనిపించింది.
సామానులన్నీ సర్దుకున్నారు.
ఇరుగుపొరుగు వాళ్ళు కన్నీటి వీడ్కోలు పలికారు.
----
శారదమ్మ
ఆలోచలనలకు అంతరాయం కలిగిస్తూ పై బెర్త్ మీదున్న సంచి క్రింద పడిపోయింది.
సంచిలోనుండి పడిపోయిన పుస్తకాలు కాగితాలు తిరిగి సంచిలోకి సర్దుతున్నప్పుడు పుస్తకంలోంచి కవరొకటి జారిపడటం చూశాడు
భానుమూర్తి. కవరు విప్పగా అందులో నారాయణమూర్తి రాసిన లేఖ వుంది. తేదీని బట్టి చూస్తే ఆయనకు పక్షవాతం వచ్చిన
రోజున రాసిందిలా వుంది.
“ గత జన్మలలోని
పుణ్య ఫలమే మానవ జన్మ అంటారు.
నేనేం పాపం చేశానోయేమో పేద
బ్రాహ్మణుడిగా పుట్టించాడు దేముడు. బోలెడన్ని కష్టాలు, కనీళ్లు ప్రసాదించాడు. సంపన్నుడ్ని కాకపోయినా ఉన్నదాంట్లో సర్దుబాటుచేసుకుంటూ కాపురం
నెట్టుకొస్తున్న నేను భాను చేసిన పనికి సగం చచ్చిపోయా. అమ్మాయి మొగుడ్ని వదిలేసి
వచ్చిన తర్వాత మిగతా సగం చచ్చిపోయా. ఉద్యోగం ఊడినప్పుడు పూటగడవడం కష్టమై కూలి
పనికి పోతే ‘ పంతులుగారూ ఈ పనికి మీరు పనికిరారు
పొమ్మన్నప్పుడు’ సమాజంలో పేద బ్రాహ్మణుడి స్థాయేమిటో
అర్ధమైంది. పంతులుగారన్న గౌరవానికి లోటు లేదుకానీ మిగతావన్నీ లోటే. కసిపట్టి కావలించుకున్న కష్టాలతో ప్రస్తుతం జీవచ్ఛవంలా బ్రతుకుతున్నా. భార్యా బిడ్డలను
పోషించుకోలేని దౌర్భాగ్యుడిని. తోటి జనమే
కాదు ప్రభుత్వం కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తోంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న విధంగా వుంది మా
పరిస్థితి. పిల్లలు చదువులోనూ, ఉద్యోగాల్లోనూ
అవకాశాలు పొందలేని దుస్థితి
దాపురించింది. నేనే కాదు నాలాంటి పేద
బ్రాహ్మణులు ఎన్ని కష్ట నష్టాలుకు గురవుతున్నారో.
‘కులం కిరీటం తగిలించుకొని గొప్పలు పోతున్నామెగాని కష్టాల
కొలిమిలోకి నెట్టబడి యాచకులమవుతున్నామని తెలుసుకోవడంలేదు ..
ఆలోచనల
అగ్ని పర్వతాలు పేలి నా తలలోని నరాలు
చిట్లిపోతున్నాయి. ఈ బాధలను భరించే శక్తి ఇక లేదు. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపోవాలనుకుంటున్నా. భార్యా బిడ్డలకు అన్యాయం చేసిపోతున్నందుకు
చిన్నవారైనా మన్నించమని కోరుతున్నా. సమస్యలనుండి తప్పుకునేందుకు పిరికివాడిలా
ప్రాణం తీసుకున్నాడనే అపవాదు మోసుకుపోతున్నా. కుటుంబాన్ని
ఆదుకోని కొడుకు కొరివి పెట్టేందుకు
మాత్రం ఎందుకు ?
మరో జన్మంటూ వుంటే మనిషిగా పుట్టించవద్దని, పుట్టించినా పేద బ్రాహ్మణుడిగా మాత్రం వద్దని
భగవంతుని కోరుకుంటూ .. ..... మీ నారాయణమూర్తి
ఉత్తరం
చదివిన భానుమూర్తి కన్నీళ్లను తుడుచుకుంటూ ఉత్తరాన్ని శారదమ్మకు అందించాడు. ఉత్తరం
అంతా చదివిన శారదమ్మకు అప్పుడు అర్ధమైంది
ఈ ఉత్తరం రాసిన రోజు రాత్రే నారాయణమూర్తి కి పక్షవాతం వచ్చిందని. శారదమ్మ శోక సముద్రంలో మునిగిపోయింది . ఇవేమీ తనకు పట్టనట్లు సర్కార్ ఎక్స్ ప్రెస్
ముదుకు దూసుకు పోతోంది.
