Thursday, 16 May 2013

ఎంగిలాకులు




                   ఒరే పొట్టిగా ఇంకో నెల రోజుల్లో  అమ్మాయి పెళ్లి.  ఈనెల రోజులు ఎక్కడకు పోబాకు.  ఇంటికాడ చానా  పనులున్నాయి. ఇంటి లోగిలంతా శుభ్రం చెయ్యాల.  దొడ్లో చెత్త చెదారం తీసెయ్యాల”.  హుకుం జారీ చేశాడు ఊరి ప్రెసిడెంట్.   
                   పొట్టిగాడి పూర్తి పేరు పొట్టెయ్య .   ముందర పొట్టెమ్మ  దేవతకు మ్రొక్కుకున్న మీదట  పుట్టాడని వాళ్ల తల్లిదండ్రులు ఆ పేరు పెట్టుకున్నారు.  పేరు పొట్టెయ్య  అయినా  ఆయన అమ్మ నాన్నలే  కాదు  ఊళ్ళో జనం  కూడ  పిలిచేది  పొట్టిగాడనే.   ఊరి చివర పెద్ద చింతచెట్టు నీడనున్న గుడిసే అతని నివాస భవనం.  చుట్టూ  వున్న కరతుమ్మ చెట్లే  ప్రహరీ.    పొట్టెయ్యకు  భార్య ఇద్దరు కూతుళ్ళు.   పెద్దమ్మాయి  పేరు రంగమ్మ  ఊళ్ళో అందరూ రంగి అంటారు.  రెండో అమ్మాయి పేరు కలగమ్మ .  కలుగోళమ్మ దేవత పేరు పెట్టుకున్నారు.  కానీ ఊళ్ళో వాళ్ళంతా  కల్లీ  అనో లేక ఎర్రగా వున్నందున పండుదానా  అనో పిలిచేవాళ్లు .  పండు   నిజంగానే చూడ చక్కగా వుంటుంది.  కొందరైతే  ఈపిల్ల  మీ ఇంట్లో పుట్టాల్సింది కాదు  అనేవాళ్లు.  యానాదోళ్ల  ఇంట్లో ఇంత చక్కనైన అమ్మాయి పుట్టిందేమిటని ఈర్ష్య పడేవాళ్లు కూడా లేకపోలేదు.
                   బిట్రగుంట తిరనాళ్లలో  పెద్ద కూతురి పెళ్లి చేసిన సంవత్సరం తిరగముందే  తాత అయ్యాడు పొట్టెయ్య.  మనుమరాలికి ఇప్పుడు మూడేళ్లు .  రెండవ పిల్లకు ఇంకా పెళ్లి ప్రయత్నం చెయ్యలేదు.  ఎవరైనా యింకా పెళ్లి చెయ్యలేదేమీరా అంటే,  మా పిల్లకు గొప్పోడొస్తాడు.  ఎదురుకట్టమిచ్చి ఎగరేసుకుపోతాడు అనేవాడు.
                   ప్రెసిడెంట్ గారి మాటల్తో  పొట్టెయ్యకు ఎక్కడలేని ఆనందం కలిగింది.  తనింట్లోనే  పెళ్లి జరుగుతున్నంత సంబరపడిపోయాడు.
                   “ అట్టాగెనయ్యా”    చింపిరి జుట్టులో  గోక్కుంటూ  అన్నాడు  పొట్టెయ్య.
                   ఆ(   మరిచిపోయా .. నీ పెద్ద కూతుర్ని కూడా పిలిపించుకో,  ఇక్కడ పనులు చాలా  వుంటాయి. అన్నాలు తినేటప్పుడు ఆకులు ఎత్తేదానికి ఎట్టా మనిషి కావాల.  మళ్ళీ ఇంకొకరిని పిలవడమెందుకు.  చెప్పాడు ప్రెసిడెంట్. 
                   సరే నని  తలూపి నాలుగంగల్లో ఇంటికి చేరుకున్నాడు పొట్టెయ్య.  ఆనందంతో  ఆపాదమస్తకం ఉబ్బి తబ్బిబవుతున్నాడు.   ఆసామి ఇంట్లో  పెళ్లి విషయం పెళ్ళాం  పోలమ్మ చెవులో  వేశాడు.  పెళ్లి సందర్భంలో వాళ్ళు చెయ్యాల్సిన పనులుగానీ, కలిగే కస్టం గాని  వారు ఆలోచించడం  లేదు.  పెళ్ళికి ప్రెసిడెంట్ గారు ఇవ్వబోయే  వరంబడి, వాళ్ళు పెట్టబోయే వంటలు గురించిన  ఊహల్తో రోజులు గడచిపోయాయి.  పెళ్లి పిలుపుకు ప్రెసిడెంట్ గారు సతీసమేతంగా ఊళ్ళకు పోయిన సమయంలో  పొట్టెయ్య  వీలుచూసుకొని పెద్ద కూతురు దగ్గరకు పోయి పెళ్ళికి  రెండు రోజులు ముందుగా కూతుర్ని అల్లుడ్ని  రమ్మని చెప్పొచ్చాడు.    
                   రంగమ్మొక్కటే తన మూడేళ్ళ కూతుర్ని తీసుకొని వచ్చేసింది.  వచ్చిందే తడవుగా ప్రెసిడెంట్ గారింట్లో పనిలో కలుసుకుంది. 
                   పొట్టెయ్య  కుటుంబం లోని వారందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.  తన ఇంట్లో పెళ్లైనట్లు పనులన్నీ ఎంతో బాధ్యతతో చెయ్యసాగారు. 
                   పెళ్లి రోజు రానేవచ్చింది.  మరునాడు ఉదయం పదిన్నర  గంటలకు పెళ్లి ముహూర్తం.  ముఖ్యమైన బంధువులు ముందు రోజే వచ్చారు.  పొట్టెయ్యకు,  భార్య పిల్లలకు చేసినంత పని. వచ్చిన బంధువులకు సపర్యలు చేస్తుండడంతో   రాత్రంతా నిద్రే లేదు. వంట పాత్రలు తోమడం, లోగిలి చిమ్మి నీళ్ళు చల్లడం, కుర్చీలు సర్దడంతోనే తెల్లవారిపోయింది.   ఆకాశమంతటికి ముసుగేసినట్లు  వివాహ ప్రాంగణమంతా  షామియానాలేశారు. 
                   సూర్యోదయానికి ముందునుంచే  పెళ్లి హడావుడి మొదలైంది.  వేకువజామున  మూడు గంటలనుంచే  వంట వాళ్ళ పనులు ప్రారంభమయ్యాయి.  వంటవాళ్లు కూడా అడపా దడపా పొట్టెయ్యకు పనులు పురమాయించసాగారు.   పొడవాటి  అరిటాకు కట్టలు తెచ్చి పడేశారు.  వాటిని కట్ చేయడం,  భోజనాలకు,  టిఫిన్లకు సైజుల వారీ వేర్వేరుగా కట్టలు కట్టడం కూడా  పొట్టెయ్యకే పురమాయించారు.
                   ఉదయం ఎనిమిది గంటలకల్లా కొందరు దగ్గరవాళ్లు, ఊళ్ళోవాళ్లు రావడం ప్రారంభమైంది.  వచ్చేవాళ్ళకు టిఫిన్లు ఏర్పాట్లు  చెయ్యడంలో కొందరు నిమగ్నమయ్యారు.   టిఫిన్ తిన్న ఆకులను  తీయడం టేబుళ్లు తుడవడంలో పొట్టెయ్య కూతుళ్ళు కూడా నిమగ్నమయ్యారు.  పనులు ఒత్తిడి, నిద్రలేమితో  వాళ్ళకు కడుపులో మంట ప్రారంభమైంది.  కడుపులో ఎధైనా పడితేగాని దానికి ఉపశమనం కలగదు.  నీళ్ళు తాగి తాగి కడుపు ఉబ్బడం తప్ప ప్రయోజనం లేదు.  మూడేళ్ళ వయస్సున్న  పొట్టెయ్య  మనుమరాలు కూడా తినేవాళ్లను చూసి తనకు పెట్టమని తల్లిని మారాంచెయ్యసాగింది.   ఎలాగూ టిఫిన్ పెట్టలేని రంగి కోపంతో పిల్లకు  రెండు లెంపకాయలు పెట్టింది.  ఏడుపు లంకించుకున్న పిల్లను చూస్తూ  “ ఇదేందిరా  పెళ్లి పందిరికాడ  ఏడుపు.    ఒరే యానాది ఈపిల్లని దూరంగా తీసుకుపో”  అంటూ చుట్టాలాయన గదమాయించడంతో మనుమరాలిని ఎంగిలి ఆకులు   వేసే దిబ్బ  వద్ద కూర్చోబెట్టాడు పొట్టెయ్య.   కడుపులో తపన తట్టుకోలేక అక్కడ టిఫిన్లు పెట్టే వాళ్ళను తనకు కూడా కొంచెం పెట్టమని ప్రాధేయపడింది రంగి.
                   ఏందే ?  మీకు అప్పుడేనా చుట్టాలింకా చాలామంది వస్తారు.  వాళ్ళకు అయింతర్వాత ఆఖరున మిగిలింది మీకేగదా.   కొంచెం ఓపిక పట్టండి. ఎంతసేపు తిండి గొడవేనా  విసుక్కున్నాడాయన ఆకలి మంటపై ఆజ్యం పోస్తూ.    పొట్టెయ్యకే  కాదు పెళ్ళాం, పిల్లలకు ఆకలి బాధ పిండేస్తోంది.  మొదట్లో  పరుగెత్తి  చేసినట్లు పనులు చేయలేక పోతున్నారు.  కాళ్ళు సచ్చుకుపోతున్నాయి.  నీరసంగా వుంది.  పెళ్లి ఘడియలు దగ్గరయ్యేకొద్ది జనం తాకిడి ఎక్కువకాసాగింది.  పదుల సంఖ్యలో కార్లు,  మోటారు సైకిళ్ళు  ఇతరత్రా వాహనాలు గేటుకు ఇరువైపులా నిలిచిపోయాయి.   వరద తాకిడికి కొట్టుకుపోతున్న వ్యక్తులు ఆసరా కోసం ఆర్తనాదాలు పెట్టే వారిలా వుంది వీరి  పరిస్థితి.  
                   ముహూర్త  సమయం దగ్గరపడింది.  బంధు మిత్ర సపరివార సమేతంగా అందరూ పెళ్ళికి హాజరయ్యారు.  వివాహ వేదిక  ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది.  టిఫిన్లు పెట్టడం ఆపేశారు. కారణం  పాత్రలు ఖాళీ.  ఇంతలో ప్రెసిడెంట్ గారు వచ్చారు.  “ఇంకేమీ టిఫిన్లు రా,    పెళ్లి కాగానే భోజనాలు పెడతున్నాంగా అవన్నీ ప్రక్కన పెట్టేసెయ్యండి”. అని చెప్పి కళ్యాణ వేదిక  వైపు వెళ్లిపోయాడు.
                   ఆమాటతో  రంగి, కల్లీల ప్రాణం ఉసూరుమనిపోయింది.  పేలవంగా మారిన ముఖాలతో జనానికి దూరంగా ఎంగిలాకులు  వేసిన చోటికి వెళ్ళి కూర్చున్నారు.  అప్పటివరకు గుర్తుకురాని కూతురు   కోసం చుట్టూ చూసింది.  దిబ్బ  ప్రక్కన ఎంగిలాకుల్లో  మిగిలిన వాటిని తింటూ కనిపించింది.  ఆకలి మెలిబెడుతున్న రంగికి  ఆవేశం అగ్ని పర్వతంలా రగిలింది.  పిల్లను బరబరా ఈడ్చుకొచ్చి మళ్ళీ బాదింది.   కానీ ఈసారి ఏడుపు మాత్రం  మంగళ వాయిద్యాల హోరులో ఎవ్వరికీ వినిపించలేదు.
                   “ యానాదుల్ని టిఫిన్ పాత్రలు అర్జెంటుగా కడగమని చెప్పండి.  అవి అవసరం”.    హుకుం జారీ చేశాడు వంటాయన.   చేవ చచ్చిన శరీరాలు పనికి సహకరించడం లేదు.  తప్పదన్నట్లు  శక్తిని కూడగట్టుకొని పాత్రలు కడిగారు.  రంగి ఆలోచన ఎంగిలి ప్లేట్ల మీదికి పోయింది.  కడుపు నింపుకోడానికి తన కూతురు చేసినట్లు చేస్తే; బాగుండదేమో-  సంధిగ్దావస్థలో వుంది రంగి.  మధ్యాహ్నమైనా  తిండి పెట్టరు.  అందరూ తిన్న తర్వాత ఏ సాయంకాలానికో గాని మా ముఖం చూడరు.  అప్పుడుదాక ఆకలితో చచ్చేకంటే యిదే మేలు.  తన మనసులోని మాట తల్లికి, చెల్లికి చెప్పింది.  ఈయాలోచన బాధ కలిగించినా ఆకలి బాధ ముందు బలాదూర్.   ఇలాంటి స్థితే పేదోళ్లను భూస్వాములకు బానిసలను చేసింది.  కూటికుంటే కోటికున్నట్లుగా భావించే బడుగుల బ్రతుకులు అట్టడుగునే  ఉండటానికి కారణం ఇదే.
                   అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై పెళ్లి వైభవంగా జరుగుతోంది.   రకరకాల సెంట్లు పూల  పరిమళాలు, రకరకాల వంటకాల   ఘుమఘుమలు ఆప్రదేశమంతా ఆవరించాయి.   భజంత్రీలు పోటీపడి మరీ వాయిస్తున్నారు.  వాయిద్యాల శబ్దంలో  ఒకరి మాటలు ఇంకొకరికి   సక్రమంగా వినిపించడం లేదు.  పెళ్లి జరుగుతున్నంతసేపు ఎవరి సంభాషణల్లో వారు మునిగిపోయారు.   పరిచయాలు,  పెండ్లి సంబంధాల విచారణలుతో కొందరు బిజీ అయిపోయారు.   పుష్కర కాలంలోనే  పుస్తెలు కట్టడంతో ప్రధాన వివాహ ఘట్టం  ఘనంగా ముగిసింది.  అక్షింతలుతో  ఆశీర్వదించిన వాళ్ళు తదుపరి తంతు తమది కాదని  భోజనాలవైపుకు తరలసాగారు. 
                     పొట్టెయ్య కుటుంబీకులు మాత్రం నిస్తేజంగా అందరి ముఖాలు చూస్తూ వుండిపోయారు.  పెళ్లి విషయం తెలిసినప్పుడు   కలిగిన ఆనందం పెళ్లి రోజున ఆవిరైపోయింది.    నే నెట్టాగున్నా  పర్లేదు   అనవసరంగా రంగిని పిలుసుకొచ్చి కట్టపెట్టానన్న బాధ  పొట్టెయ్య మనసులో మెదలసాగింది.  ఏవేవో  ఆలోచనలతో పరధ్యానంగా వుండిపోయాడు.
                   “ఒరే పొట్టిగా  ఏంచేస్తున్నావక్కడ? ఇందాకట్నుంచి పిలుస్తున్నా వినపట్టంలే,  మన లోకంలో లేనట్టున్నావ్’’  - కొప్పడ్డాడు ప్రెసిడెంట్ బావమరిది.  “తొందరగా పోయి అన్నాలు పెట్టేకాడ డ్రమ్ముల నిండా నీళ్ళు పొయ్”  అన్న ఆయన మాటలతో  గబగబా బావి వైపు పరుగు తీశాడు పొట్టెయ్య.
                   భోజనాల కార్యక్రమం  మొదలయింది.  వచ్చేవాళ్ళకు,  పోయేవాళ్ళకు సందేలేదు.  పొట్టెయ్య పెళ్ళాం పిల్లలకు క్షణం తీరికలేదు.  ఎంగిలాకులు  తీయడం, టేబుళ్లు తుడవడంతోనే సరిపోయింది. భోజనాలకు కూర్చున్నవారికి వద్దంటున్నా మరీ మరీ అడిగి  వడ్డిస్తున్నారు సప్లయర్స్.   కొందరైతే పెట్టినవాటిలో సగం వదిలేశారు.   వాటిని  తీసేటప్పుడు వీళ్ళ ప్రాణం తహతహలాడేది.  కొందరైతే  పెట్టిన స్వీట్లు అలానే వదిలేశారు.  వారికున్నా తినలేరు.  వీరికి లేక తినలేరు.  ప్రొద్దుటి  అనుభవం వారికి గుణపాటమయ్యింది.  రంగి కూతురు చేసిందే కరెక్ట్.  ఇప్పుడయినా తిండి విషంలో జరుగబోయేదేదో వాళ్ళ ఊహకందనిదేమీ కాదు.  అందువల్ల  ఎంగిలాకుల్లో  మిగిల్చిన స్వీట్లు ఇతరత్రా  తీసిపెట్టుకోసాగారు.  రంగి కూతురుకి కూడా వాటిని తిని తిని  మొహం మొత్తింది.
                   మధ్యాహ్నం  రెండు గంటలకల్లా భోజనాలు కార్యక్రమం పూర్తయ్యింది. ఆఖరున ఇంట్లో పనివాళ్లతోపాటు ఇతరులందరిని పిలిచి భోజనాలు పెట్టారు. కానీ అక్కడే వున్న  పొట్టెయ్యవాళ్ళను  పట్టించుకున్న వాళ్లే లేరు.  ఇక తప్పదన్నట్లు వీళ్ళు కూడా బంతిలో ఒక చివర కూర్చోబోయారు. “ మీరు అప్పుడే కాదు కాసేపు ఆగండి.  మేము తిన్న ఆకులు ఎవరు తీస్తారు రా”   అంటూ వారించిన వాళ్ళు  తర్వాత ఆ విషయమే మరచిపోయారు.   బంధువులందరు వెళ్ళిపోయారు ఎవరో ముఖ్యులు తప్ప. సాయంకాలం కావస్తున్నది.   ప్రెసిడెంట్ గారి భార్య పనిపాటల వారితోపాటు  పొట్టెయ్య వాళ్లనుకూడా పిలిపించింది.  ఏంరా అన్నాలు తిన్నారా? అనడిగింది.   పొట్టెయ్య లేదన్నట్లుగా తలూపాడు. “ ఏం ? ఎందుకు తినలేదు.  నువ్వేమన్నా కొత్త చుట్టానివా పిలిచి వడ్డించేదానికి.  పని వాళ్లతోపాటే   మీరూ తీనొచ్చుగా.  ఇంతకూ వంటకాలన్నీ వుండాయో లేదో.  వంటమనిషి పిలువ్”  అన్న మాటతో పరుగుపరుగున పోయి వంటమనిషిని పిలుచుకొచ్చాడు పొట్టెయ్య.  
                   ఏం  రమణయ్యా వంటలేమైనా మిగిలినాయా ? అడిగిందామె వంటమనిషిని
                   లేదమ్మా కొద్దిగా వున్నాయి.  అన్నం కొంచెం వుంది.  కూరలు చాలావరకు అయిపోయాయి. మీరు చాకలోళ్లకు పెట్టాలన్నారుగా.  నసిగాడు వంటమనిషి రమణయ్య.
                   అయ్యో పాపం  ఈ పొట్టిగాడోళ్లు అన్నంకూడా తినలేదంట.  ఏం చేస్తాం  పిండివంటైనా  కొంచెం తెచ్చి పెట్టు.  రాత్రికన్నా  అన్నం పెడదాం.  పాపం పనంతా వీళ్ళదే.  సానుభూతి  తెలిపిందామె.
                   పొట్టెయ్య కోటి ఆశలు నీటి మూటలయ్యాయి.  అవసరానికి వాడుకొని విసిరి పారేసే ఎంగిలాకులకు మాకు  తేడా ఏముంది.  అందుకే ఎంగిలాకులు మాకు  నేస్తాలు.  మా కడుపులు నింపే అక్షయపాత్రలు.  పొట్టెయ్య కి మొట్టమొదటి సారిగా మదిలో  మెదిలిన నగ్న సత్యాలు.
                   వాళ్ళు  విస్తట్లో పెట్టి యిచ్చిన పిండివంటలు తీసుకొని ఇంటికి పోయిన  పొట్టెయ్య కొంచెంసేపు      సేద తీరి  తిరిగి రాత్రికి పెళ్ళాం పిల్లలతో పెళ్ళింటికి చేరుకున్నాడు.  ప్రెసిడెంట్ గారి భార్య యధావిధిగా వాళ్లందరికి  పనులు పురమాయించింది.  ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమైవున్నారు.
                    “పని కాగానే అన్నాలు తినండిరా  చెప్పింది ప్రెసిడెంట్ భార్య.  ఆ మాటతో పనులన్నీ గబగబా చేసేసి అన్నం తినేందుకు సిద్దమయ్యారు వాళ్ళు.  కానీ కల్లీ మాత్రం రాలే.  కొంతసేపు వేచి చూసినా రాకపోయేసరికి   ఎక్కడికి పోయిందని పెళ్లాన్ని  అడిగాడు పొట్టెయ్య.  “ అమ్మగోరు రమ్మన్నారని ఎవురో ఒకాయన వచ్చి  పిలుచుకొని పోయాడు.  ఇప్పుటికి రాలా. చెప్పింది పోలమ్మ.
                   “ నేనిప్పుడు  ఆడనుంచే వచ్చేది.  నాకు గనపడలేదే.  ఏడకు బోయిందబ్బా.  పొట్టెయ్య గబగబా ప్రెసిడెంట్ గారి ఇంటి ఆవరణంతా వెదికాడు.  జాడే లేదు.  పనివాళ్ళనందరిని అడిగినా మాకు తెలియదన్నారు.  అమ్మగారితో చెప్పినా “ ఎక్కడికి పోద్దిలేరా,  అదేమన్నా చిన్న పిల్లా.   ఇక్కడే ఎక్కడో వుంటది చూడు.  లేకపోతే ఇంటికి పోయిందేమో చూడు.  అమ్మగారి మాటల్లో ఏదో తేడా గమనించాడు పొట్టెయ్య పరుగు పరుగున ఇంటికి పోయారందరు.  ఇంట్లో బోర్లా పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది కల్లీ.   ఆ అమ్మాయి పరిస్తితి చూస్తే ఏదో జరగరానిది జరిగినట్లు అర్ధం చేసుకోడానికి ఎంతో సమయం పట్టలేదు.   ఆవేశం, ఆవేదన మిళితమైన స్థితిలో  ఏమైందే ? ప్రశ్నించాడు  పొట్టెయ్య.    “ ప్రెసిడెంట్ గారి బావమరిది నన్ను అమ్మగారు రమ్మన్నారని పిలిపించుకొని తానానికి నీళ్ళు తోడమని లోపలికి పిలిచి నన్ను పట్టుకొని గందరగోళం చేశాడు.  అమ్మగారు చూసేసరికి వదిలేసి ఎల్లేడు” వచ్చే ఏడుపు దిగమింగుకొంటూ  చెప్పింది కల్లీ.
                   ప్రెసిడెంట్ గారింట్లో పనిమనిషి వచ్చి  “అమ్మగారు రమ్మంటున్నారు.  అన్నాలు తినమంటే తినకుండా పోయారెందుకో  కనుక్కొని రమ్మని  పంపించిందని  చెప్పాడు. 
                   “వస్తుండాం”   అన్న  పొట్టెయ్య  సమాధానంతో  వెళ్లిపోయాడు పనిమనిషి.  నిజానికి పొట్టెయ్యకు అక్కడకు పోవడం ఇష్టం లేదు.  పోకపోతే కోప్పడతారేమో నన్న భయంతో తానొక్కడే వెళ్ళాడు.  
                   నీపెళ్ళాం పిలకాయలు ఏరిరా ? అన్నాలు తినకుండా ఎల్లిపోయారేం.  మధ్యాహ్నం పెట్టలేదని అలిగారా ఏంది ?  ఇయిగో ఈ అన్నం కూరలు, పిండివంట ఇంటికి తీసుకుపో.  ఈ ఐదు వందలు రూపాయిలు తీసుకొని నీ పెళ్ళాం పిల్లలకి గుడ్డలు కొనియ్.  పెళ్ళికి ముందే ఇద్దామనుకున్నా.  పని ఒత్తిడిలో గుర్తేలేదు.  నా పాత చీరలు రెండున్నాయి.  రేపు పోలిని రమ్మను ఇచ్చి పంపిస్తా. మా అమ్మాయి అత్తగారింటికి పోయేటప్పుడు నీ చిన్న కూతురికి మంచి  గుడ్డలు ఇప్పిస్తాలే.   మళ్ళు పెళ్ళికి పోయొచ్చిన తర్వాత అయ్యగారియి వాడని గుడ్డలుండాయి ఇస్తాలే.”  చెప్పింది ప్రెసిడెంట్ గారి భార్య జరిగిన విషయం తనకేమి తెలియదన్నట్లుగా నటిస్తూ.
                   జరిగిందానికి మనసులో మెదులుతున్న  బాధ  అనుకోని ఈ వరాల వరదలో కొట్టుకుపోయింది.  ఇంటిల్లపాదీ కష్టపడ్డదానికి కనీస కూలి కూడా గిట్టుబాటుకాని    వరుంబడికి సంబరపడిపోయిన అల్పసంతోషి పొట్టెయ్య.  తన కూతురికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేని అశక్తుడు. ఎదిరించి బ్రతకలేని భీరుడు.  అవసరానికి వాడుకొని ఎంగిలాకుల్లా విసిరిపారేస్తారన్న విషయం తెలిసీ   పేదరికపు దారంతో   చుట్టిన బ్రతుకు   బొంగరాన్ని పెద్దోళ్ళ చేతుల్లో వుంచినంత కాలం    బడుగుల జీవితాలు బాగుపడవు.  వీళ్ళ గతింతే.  ఎంగిలాకులే.

2 comments:

PDSUKAVALI at: 16 May 2013 at 05:29 said...

" పేదరికపు దారంతో చుట్టిన బ్రతుకు బొంగరాన్ని పెద్దోళ్ళ చేతుల్లో వుంచినంత కాలం ఈ బడుగుల జీవితాలు బాగుపడవు. వీళ్ళ గతింతే. ఎంగిలాకులే. ", చాలా భాగుంది సార్. చాలా భాగా చెప్పారు.

Unknown at: 6 June 2013 at 01:01 said...

మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు..

Post a Comment