Sunday, 23 June 2013

విహారయాత్ర


అవి నేను ఏడవ తరగతి చదివే రోజులు. సంవత్సర పరీక్షలు పూర్తికాగానే మా క్లాస్ టీచర్ పిల్లలందరిని విహారయాత్రకు తీసుకొని పోయేందుకు ఏర్పాట్లు చేశాడు. ఎక్కువ దూరం పోయేందుకు విద్యార్ధుల తల్లిదండ్రులు ఇష్టపడనందున దగ్గరలో వున్న ‘రామాయపట్నం’ కు వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు. సాయంకాలం 4.00 గంటలకు బయలుదేరి కొత్తసత్రంకు చేరుకొని అక్కడనుండి పడవ మీద బకింగ్ హామ్ కాలువగుండా రామాయపట్నం వరకు ప్రయాణం. ఆ రోజుల్లో మద్రాస్ ( నేటి చెన్నై) నుండి విశాఖపట్నం వరకు కోస్తా తీరం వెంబడివున్న బకింగ్ హామ్ కెనాల్ (ఉప్పు కాలువ) గుండా ఎండుచేపలు, ఉప్పు, కలప ఇతరత్రా సరుకులు రవాణా జరుగుతుండేవి. రవాణా చేయు పడవలు షుమారు 20 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పు వుండేవి. అందువల్ల మేము 25 మందిమి ప్రయాణించేందుకు అనుకూలంగానే వుండింది. రాత్రికి రామాయపట్నంలోనే వుండి సూర్యోదయాన్ని చూడాలనుకున్నందున రాత్రికి మరియు మరునాటికి భోజన ఏర్పాట్లుకు కావలసిన సరుకులు, పాత్రసామగ్రి వంట మనిషిని కూడా వెంట తీసుకుపోయాము.

సాయం సమయంలో కాలువ గుండా పడవ ప్రయాణం మాకెంతో ఆనందాన్నిచ్చింది. కాలువకు ఇరు వైపులా పెద్ద పెద్ద దట్టమైన పొదలు, పచ్చని చెట్లు, ఆ చెట్లపై వాలిన రకరకాల పక్షులు ముఖ్యంగా గుంపులు గుంపులుగా వాలిన వివిధ జాతుల కొంగలు, పక్షుల కిలకిలారావాలుతో మాటలకందని మధురానుభూతిని పొందాము. మేము బయలుదేరిన గంటలోపే రామాయపట్నం చేరుకున్నాం. మసక చీకటి అలుముకుంటోంది. సముద్రం దగ్గర్లో వున్న బంగళాలో మాకు బస ఏర్పాటు చేశారు. పేరుకు బంగళా అయినా అదొక పురాతన ఇల్లులా వుంటుంది. కిటికీ తలుపులు కూడా సక్రమంగా లేవు. ముందు, వెనుక పెద్ద పెద్ద చెట్లు. చుట్టూ సవుక తోటలు చూసేందుకే భయంగా వుంది. పైగా అతి దగ్గర్లో వున్న సముద్రపు ఘోషతో మా భయం ఇంకా పెరుగుతోందేకాని తగ్గడంలేదు. మాతో వచ్చిన వంటవాళ్లు రాత్రికి భోజనం ఏర్పాటు చేశారు.

“ అందరూ మాటలు కట్టిపెట్టి త్వరగా నిద్రపోండి. వేకువనే లేచి సూర్యోదయాన్ని చూసేందుకు పోవాల. అతిగా ప్రవర్తించి రాత్రులు అటూ ఇటూ తిరగబాకండి. ఇక్కడ పాములు, తేళ్ళు వుంటాయి జాగ్రత్త” హెచ్చరించాడు క్లాస్ టీచర్.

ఈ భయంకర వాతావరణంలోకి ఎందుకొచ్చాము దేవుడా అనుకుంటూ కళ్ళు మూసుకొని పడుకున్నానే గాని నాకు నిద్ర పట్టలా. కీచురాళ్ళ అరుపులు, సముద్రం పొంగి వస్తోందేమో అన్నట్లు అలల శబ్దం భయంకరంగా వుంది. వీటికి తోడు ఏదో వింత శబ్దంగా స్పురించే ఒకరిద్దరి గురకలు. ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ ఇవేమీ పట్టనట్లు నిద్రలో మునిగిపోయారు.

సముద్రం మీదినుంచి వచ్చే చల్లటిగాలికి చలి పుట్టుకొచ్చింది. కొందరు తాము తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకుంటే. మరికొందరు ముడుచుకొని పడుకోనుండిపోయారు. ఇవన్నీ గమనిస్తూ పడుకున్న నేను మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. అరకొర నిద్రలో వున్న నా మిత్రుడు రాజా ను లేపి నాకు తోడుగా రమ్మని పిలుచుకొనిపోయా. ఆ పరిసరాలు మాకు అంతగా తెలియనందున ఎటువైపు వెళ్లాలో మసక వెన్నెల్లో అర్ధం కాలా. ఏది ఏమైనా అవసరం కాబట్టి కొంచెం ముందుకు కదిలాం. మూత్ర విసర్జన చేస్తూ ఏదో అలికిడి అయ్యేసరికి అటువైపు చూశా. గుండె గుభేల్ మంది. మూత్రమంతా చెడ్డీలోనే అయిపోయాయి. కొంచెం దూరంలో తెల్లని ఆకారం చేతులు చాపుకొని ముందుకురుకుతున్నట్లు అనిపిస్తోంది. అమ్మో దయ్యం. ఇలాంటి చోటే దయ్యాలుంటాయని చెప్పుకుంటుంటే విన్నా. పెద్దగా అరవాలన్నా నోరు పెగలడంలేదు. గొంతుకను ఎవరో నొక్కిపట్టినట్లయింది. భయంతో కాళ్ళు చచ్చుపడిపోయి కదలలేని స్థితిలో వుండిపోయాను. నాకు తోడుగా వచ్చిన రాజా ఎంతసేపురా అని విసుక్కొని వెళ్లిపోయాడు. ధైర్యాన్ని కూడగట్టుకొని కాళ్లీడ్చుకుంటూ బంగళా వైపు నడిచా. చెట్ల క్రింద రాలిన ఎండుటాకులపై సరసరమని ఏదో కదులుతున్నట్లు శబ్దం. కాళ్ళపైకి ఏదో పాకుతున్నట్లనిపించింది. బహుశా తేలేమో. కాలిని గట్టిగా విదిలించి ఒక్క అంగలో బంగళా చేరుకున్నా. వెంట తెచ్చుకున్న దుప్పటి కప్పుకొని పడుకున్నాకూడా తెల్లని ఆకారమే గుర్తుకొస్తూవుంది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఊపిరి బిగబట్టుకొని పడుకున్నా. మూత్ర విసర్జనకు పోకున్నా బాగుండేది. పోయి పోయి దాని కంట్లో పడ్డా. ఏమి జరుగుతుందో ఏమో అనుకుంటూ భయంతో అలాగే వుండిపోయా.

వేకువజామున 4.30 గంటలయ్యింది. క్లాస్ టీచర్ అందరినీ నిద్రలేపాడు. తోటి విద్యార్ధులందరికి నిద్ర మత్తు వీడేసరికి ఓ పావుగంట పట్టింది. వీళ్ళందరూ మేల్కొనేసరికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అందరూ మూత్ర విసర్జన కోసం బంగళా చుట్టుప్రక్కలకు పోయారు. నేను కూడా వారితో కలిసి వెళ్లా. రాత్రి జరిగింది గుర్తుకొచ్చి చుట్టూ చూశా. బంగళా వెనుక వైపు దగ్గర్లోనే ఆ ఆకారం వుంది. రాత్రి నేను భయపడ్డట్టు దెయ్యం కాదు భూతం కాదు అది పంట చేలో వుంచిన దిష్టి బొమ్మ. రెండు చేతులు చాపుకొని వుంది. దాన్ని చూడగానే ధైర్యం వచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు చూశా భూమిలోని చిన్న చిన్న బొరియల్లోంచి చిన్న చిన్న సముద్రపు ఎండ్రకాయలు అటూ ఇటూ తిరుగుతున్నాయి. బహుశా రాత్రి నా కాలుపైకి ఎక్కింది కూడా ఇదే అయివుంటుందనుకున్నా.

సూర్యోదయానికి ముందే సముద్రం వద్దకు చేరుకున్నాం. సముద్రంలోకి పిల్లలెవరినీ వెళ్లనీయకుండా కట్టడి చేశాడు మా టీచర్. నీలి రంగు సముద్రం, ఆకాశం రెండూ అంటుకుపోయినట్లుంది. ఆకాశం నిర్మలంగా వుంది. సూర్యోదయానికి ముందు ఆకాశం రంగులు మారుతోంది. సప్తవర్ణాల వెలుగులు సముద్రపు ఆవలి వైపు నుండి పైకి ఫోకస్ చేస్తున్నట్లుగా వుంది. క్రమేపీ సూర్య బింబం సముద్రంలోంచి పైకి వస్తోంది. ఎర్రని పాత్రని వివిధ రూపాల్లో బోర్లించినట్లున్న దృశ్యం మాకు కనపడింది. అందరం తదేకంగా చూస్తూ వుండిపోయాము. కొద్ది క్షణాల్లోనే సంపూర్ణ సూర్య బింబం పైకి వచ్చింది. తదుపరి అందరం మాస్టారు గారు మరికొందరి సహాయంతో సముద్ర స్నానాలు చేశాం.

వంట వాళ్ళు తయారు చేసి వుంచిన టిఫిన్లు తిని మరలా సముద్రం వద్దకు చేరుకున్నాం. అలలకు కొట్టుకొచ్చిన గవ్వలు ఏరుకుంటూ , సముద్రపు కెరటాలు పాదాలను తాకుతుంటే ఆనందానుభూతిని పొందుతూ తిరుగుతున్నాం. ఇంతలో చేపల వేటకు వెళ్ళిన తెప్పలు ఒక్కొక్కటిగా రావడం ప్రారంభమైంది. జాలర్లు గుంపులు గుంపులుగా వచ్చి వలలను సముద్రంలోంచి బయటకు లాగసాగారు. వలలు ఒడ్డుకు వచ్చిన తర్వాత మేమందరం గబ గబా చేపలను చూసేందుకు వెళ్ళాం. కానీ వాళ్ళు మమ్మల్ని దగ్గరికి రానీయలేదు. వలలలోని చేపలను పెద్ద పెద్ద గంపల్లో వేశారు. రెండో, మూడో పెద్ద ఆకుల్లాగ సన్నని పొడవాటి తోక వున్న చేపలని బయట పడేశారు. అవి టేకు చేపలని తర్వాత తెలిసింది. అక్కడున్న జాలర్లందరూ ఒక్కసారిగా అరుస్తూ చేపలను వదిలి కొంచెం దూరం వెనక్కి వచ్చేశారు. ఆ అరుపులకు మేము బిత్తరపోయాం. ఏమైందో అర్ధంకాక వాళ్ళ వైపే చూస్తూవుండిపోయాం. అక్కడ పెద్ద సైజు సాలెపురుగు లాగ నల్లని బొచ్చుతో వున్న సముద్ర జీవి ఒకటుంది. అది ఎగిరి అమాంతం మనుషులపై పడుతుందట. దాన్ని తాకితే చాలు క్షణాల్లో మనిషి ప్రాణం పోతుందట. అందుకే వాళ్ళు అలా అరుస్తూ దూరంగా జరిగారని తర్వాత తెలిసింది. ఒకతను పరుగెత్తికెళ్లి కర్రకు గుడ్డ చుట్టి తీసుకొచ్చాడు. దానిని అంటించి ఆజీవి మీద పెట్టి కాల్చారు. అది చచ్చిన తర్వాతనే వాళ్ళు తమ పని చేసుకోసాగారు.

మేము ఏర్పాటు చేసుకున్న పడవ సరైన సమయానికి రాకపోయేసరికి మేము సాయంత్రం వరకు అక్కడే వుండక తప్పలేదు. ఆటలు, పాటలు మాకు ఆనందదాయకంగా వుంటే మా టీచర్ మన జాతీయ నాయకులను గురుంచి చెప్పిన విషయాలు ఎంతో స్పూర్తి దాయకంగా వున్నాయి. ఎట్టకేలకు సాయంత్రం 4.00 గంటలకు పడవ వచ్చింది. అందరం సంచులు సర్దుకొని పడవ ఎక్కి కూర్చున్నాం. రామాయపట్నం ఊరు దాటి నాలుగైదు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఏమైందో ఏమో పడవలోకి నీళ్ళు రాసాగాయి. పడవలో వున్న వాళ్ళు నీళ్ళు తోడిపోయడంతోనే సరిపోయింది. తెడ్లు ఎంతగా వేసినా పడవ వేగంగా ముందుకు కదలడంలేదు. మేమందరం పడవలోనే నీళ్ళలో నిలబడాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు తెచ్చిన పడవను ఏవో సరుకులుంటే మద్రాస్ కు పంపారట. దానికి బదులుగా దీనిని తీసుకొచ్చారు. ఉప్పు కాలువకు ఇరువైపుల ప్రకృతి దృశ్యాలు ఆహ్లాదకరంగా వున్నా ఈ పడవ వల్ల అసౌఖర్యంగా వున్నందున ఆ అనుభూతిని పొందలేక పోయాం. ఎమౌతుందో నన్న భయంతో సాగిన మా ప్రయాణం ఎట్టకేలకు బాగా చీకటి పడే సమయానికి కొత్తసత్రం గ్రామం చేరికతో ముగిసింది.

Wednesday, 5 June 2013

తమలపాకు స్వగతం



సర్వ శుభకార్యాలకు  ఆగ్ర తాంబూలం నేనే  

పూజలకు  ప్రమాణాలకు  ముఖ్యం  నేనే  

వివాహాల  ప్రధానాలకు ప్రధానం  నేనే 

శోభనంలో శోభంతా నాదే

నవనవలాడే నవ వధువులాంటి నన్ను   

తలా తోక త్రుంచి వెన్ను  విరిచి సున్నం పూసి

ముక్కలైన వక్కకలిపి  కసితీరా నమిలి

ఆధరాలకు అందాన్నిచ్చే

ఎర్రని నా రక్తాన్ని ఉమ్ముతారు  

అశుభాలలో,   అంతిమ యాత్రలలో

 నన్ను విసిరి విసిరి పారేస్తారు

నాపై నూనె రాసి నిప్పు సెగ పెట్టి  

చిన్నారుల కడుపునొప్పికి పట్టీ వేస్తారు   

భుక్తాయాసానికి ముఖ్య దినుసును నేనే

వైద్యంలో  నేనే  నైవేద్యంలో నేనే  

నాకు ముళ్లు  లేవు మృధుత్వం తప్ప

ఆవిశలా ఆసరా దొరికితే అల్లుకుపోయేనన్ను

అణువణువు  విరిచి అశక్తురాలిని చేస్తారు

తరతరాలకైనా తలరాత మారని తమలపాకుని నేను. 

వ్యాపారం


                   సాయంత్రం ఏడు గంటలైనా సెగ తగ్గలేదు. ఆరు గంటలవరకు ముఖం బయట పెట్టలేకున్నాం. సాయంకాలం పూట బయట ఎక్కడైనా కూర్చుందామన్నా కింద కాలిపోతోంది.  ఏం ఎండలో ఏమో. ఈ మండే ఎండలు ఇంతకుమునుపెప్పుడు చూడలా”.   రైల్వే స్టేషన్లో  ప్లాట్ ఫామ్ చివరన బెంచీలమీద కూర్చుంటూ చెపుతున్నాడు రామకృష్ణయ్య తన స్నేహితుడు ప్రసాదరావుతో. 

                   రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువగా సాయంత్రం పూట రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ చివరన ఉన్న బెంచీలపై కూర్చొని పిచ్చా పాటి మాట్లాడు కుంటుంటారు.  వర్తమాన రాజకీయాలు, పెన్షన్లు, చదువులు, ఫీజులు, నిత్యావసర వస్తువుల ధరలు, వాతావరణ పరిస్థితులు ఒకటేమిటి అన్ని విషయాలపై చర్చలు, వాదోపవాదనలు అనుదినం జరుగుతుంటాయి. 

                        మీ  మనవడు  టెన్త్ మంచి మార్కులుతో పాసయ్యాడటగా, ఇంటర్  ఎక్కడ చేరుస్తున్నారు? అడిగాడు రామకృష్ణయ్య .

                   ఎక్కడ చేర్చాలో అర్ధం కావడం లేదు.  9.5 పైగా పాయింట్లు వచ్చిన వాళ్ళకు ఫీజు మినహాయింపు  ఇస్తామని  రెండు మూడు కాలేజీల వాళ్ళు ఇంటిచుట్టూ తిరుగుతున్నారు.  మరి కొందరైతే ఐ.ఐ.టి. కోచింగు కూడా ఫ్రీగానే ఇస్తామంటున్నారు.  ఫీజు లేదుకదాని ఎక్కడపడితే అక్కడ చేరిస్తే చదువులు ఎలావుంటాయో ఏమో.  కాలేజీలో వసతులు  బాగున్నాయో లేదో,  ఏదీ నిర్ణయించుకోలేక పోతున్నాం”  చెప్పాడు ప్రసాదరావు.

                   ఇంతలో వీరితో కలిశాడు చంద్రయ్య.  పిల్లల చదువు విషయమై చర్చ ప్రారంభమయ్యింది.  “ ఈ రోజుల్లో చదువు వ్యాపారమే బాగా లాభసాటిగా వుందండీ.  నర్సరీ పిల్లలకు పదివేలట.  స్కూలు కెళ్ళి వాళ్ళు చదివేదేముంది  చెప్పండి?  ఏవో బొమ్మలు చూపెట్టడం, మధ్యాహ్నం  వాళ్ళకు తెచ్చిన బాక్సులలోని బోజనం పెట్టడం, నిద్రపుచ్చడం అంతేకదా. మాటలుకూడా సరిగ్గా రాని పసి పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులకుండాలి జ్ఞానం.  మాకలా కాదు,  అయిదు సంవత్సరాలు నిండితేగాని బడిలో వేసేవాళ్ళు కాదు.  అది గవర్నమెంట్ చట్టం కూడా.  మేము చదువుకొనేటప్పుడు ప్రతి క్లాసు పాస్ కావాలి.  తప్పితే అదే క్లాసు మళ్లీ చదవాలి.  ఇప్పుడలా కాదు స్కూలుకెళితే చాలు పై క్లాసుకు పంపుతారు.  ఒక్క టెన్త్ కు మాత్రం పబ్లిక్ పరీక్ష పెట్టారు.  మున్ముందు అదీ తీసేస్తారంట.  ఇక చదువులో సత్తా ఏముంటుందండి”  తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చాడు  చంద్రయ్య.  

                   “ గవర్నమెంట్ స్కూళ్ళలో, కాలేజీలలో  ఇప్పుడు పెద్దగా ఎవరూ చదవడంలేదు.   అలా చదవడం కూడా నామోషీగా ఫీలయ్యే వాళ్ళుకూడా లేకపోలేదు.  ఇప్పుడు ఈ ప్రయివేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయిగాని,  ఇంతకుముందు మేమంతా  గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినోళ్ల మేగదా.   అక్కడ చదివినోళ్ళు గొప్పవాళ్లుకాలేదా?  కార్పొరేట్  విద్యాసంస్థల్లో చదవడం ఇప్పుడొక స్టేటస్ సింబల్ అయిపోయింది.  ఆర్ధిక స్థోమత లేకున్నా అప్పులు చేసైనా ప్రైవేట్ విద్యాసంస్థల్లో తమ పిల్లలను చేర్చేందుకు వెనుకాడడంలేదు తల్లితండ్రులు.  అంత డబ్బు పోసి చదివించినా  చదువు అంతంతమాత్రమే”  నన్న రామకృష్ణయ్య మాటలకు

                   “ అవునండీ, ఈ కార్పొరేట్  కాలేజీలవాళ్లు వేలకువేలు ఫీజులు వసూలు చేసి వందలాదిమందిని తమ కాలేజీలలో చేర్చుకుంటారు.  చేర్చుకున్న నెలలోపు వీళ్ళు నిర్వహించే పరీక్షలో వచ్చిన మార్కులను బట్టి  విద్యార్ధులను గ్రేడింగ్ చేస్తారు.  బాగా మెరిట్ వున్న విద్యార్ధులను ప్రత్యేకించి  ఒక సెక్షన్ గా ఏర్పాటు చేస్తారు.  వారికి మాత్రమే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అన్ని  వసతులలోనూ వీరికి ప్రత్యేక కేటాయింపు వుంటుంది.   మిగతావారిని  సాధారణంగా చూస్తారు.   విద్యార్ధులందరి వద్ద ఒకే విధమైన ఫీజు వసూలు చేసినపుడు ఈ వివక్ష తగునంటారా. తమ వ్యాపారం కోసం గ్రేడ్లు కావాలి.  గ్రేడ్లు కోసం విద్యార్ధులను వర్గీకరించి  వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడం కాక మరేమిటి. ఫలితాలు ప్రకటించిన రోజునుండి దాదాపు నెలరోజుల వరకు తమ తమ రాంకుల గురుంచి, హంగు ఆ ఆర్భాటం గురుంచి డబ్బా కొట్టుకోవడం అందరికీ తెలిసిందే .   అసలు తమ కాలేజీ నుండి ఎంతమంది పరీక్షకు హాజరయ్యారు,  ఎన్ని రాంకులు వచ్చాయన్న విషయం  ఎవరైనా చెబుతున్నారా?  ఏ రెండు వేల మందో హాజరైతే అక్కడ వచ్చేది వందలోపే రాంకులు. మరి మిగతా వారి పరిస్థితేంటి. వాళ్ళ సంస్థల్లో అంత బాగా చదువు చెబితే మిగతా వారికెందుకు రాంకులు రాలేదు.  అలా రాంకులు వచ్చినవాళ్లు  స్వతహాగా తెలివైన వాళ్లైవుంటారు.  ఇందులో వీళ్ళ గొప్పతనమేమీ లేదు.  వాళ్ళు ఎక్కడున్నా రాంకులు సాధించుకోగలరు.  కాకపోతే పాపం వీళ్ళను  కార్పొరేట్ కాలేజీలవాళ్లు  వ్యాపార వస్తువుగా ఉపయోగించుకుంటారు అంతే. మొద్దు కత్తికి సాన అవసరంగాని,  బాగా పదునైన కత్తికి సాన వీళ్ళు పట్టేదేముంది.  యావరేజ్ స్టూడెంట్స్ ను రాంక్ హోల్డర్స్ గా తీర్చి దిద్దగలిగితే అప్పుడు ఆ కాలేజీ వాళ్ళ గొప్పతనాన్ని ప్రశంసించవచ్చు”.  విద్యా సంస్థల గురుంచి తెలుసుకున్న  విషయాలు  విశదీకరించాడు  చంద్రయ్య.   

                   “ ఇంకొక విషయమేమంటే ఇప్పుడు జరుగుతున్న పోటీ పరీక్షలు చాలామటుకు మల్టిబుల్ ఛాయిస్ లోనే వుంటున్నాయి.   ప్రశ్నాపత్రం లోని  ప్రశ్నలకు కొన్ని  తెలిసిన  జవాబులు గుర్తిస్తే  మిగతా వాటికి ఊహాజనిత  జవాబులు గుర్తించడం జరుగుతోంది.  అదృష్టం  కొద్దీ  అలా గుర్తించిన జవాబులు సరైనవయితే రాంకులు పొందే అవకాశం వుంటుంది.   దీనివల్ల అసలైన ప్రతిభావంతులు నష్ట పోతారు.  అందువల్ల ఈ పద్ధతినే మార్చాల్సిన అవసరం ఎంతైనావుంది. మల్టిబుల్ ఛాయిస్ విధానాన్ని పూర్తిగా రద్దుచేసి  కేవలం ప్రశ్నలు మాత్రమే యిచ్చి జవాబులు వ్రాయమనే పద్ధతి తీసుకొస్తే బాగా చదువుకొనేవాళ్ళకు,  ప్రతిభ గల వాళ్ళకు న్యాయం చేసినవాళ్లవుతారు.   ప్రభుత్వం  ఈ విధానాన్ని మేధావులతో పున:సమీక్షించి సవరణ చేస్తే బాగుంటుంది”.  తన ఆలోచన చెప్పిన రామకృష్ణయ్య మాటలతో చర్చను ముగించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.            

గొర్రె వైరాగ్యం



                రామాపురంలో చంద్రయ్య పెద్ద రైతు.  ఆయనకు పొలాలు, తోటలు తోపాటు పశుసంపద కూడా బాగానే వుండేది.  చంద్రయ్య ఒక్కగానొక్క కొడుకును  బాగా చదివించాడు.  మంచి ఉద్యోగం కూడా.  వీరి స్థాయికి తగ్గ  కుటుంబంలోని  అమ్మాయితో వివాహం జరిపించారు.  పెళ్ళైన ఏడాదిలోనే కోడలు గర్భవతి అయినందుకు చంద్రయ్యకు ఆనందం కలిగింది.  వైద్య సదుపాయం సరిగా లేనందున  కోడల్ని  అమ్మగారింటికి పంపకుండా  ఇక్కడే కంటికి రెప్పలా  చూసుకోసాగాడు.

                   చంద్రయ్యకు పదికి  పైగా గొర్రెలు, పొట్టేళ్లు వుండేవి.  వాళ్లింట్లో  పశువుల కాపరి  పశువుల తోపాటు వీటిని కూడా అడవికి తోలుకెళ్లి మేపుకొస్తుండేవాడు.  వాటిలో ఒక గొర్రె సూడిదైంది. 

                   కోడలికి ప్రసవ  రోజులు వచ్చేసరికి కొడుకుని కూడా పిలిపించుకున్నాడు చంద్రయ్య. తాత కావాలని తహతహలాడుతున్న చంద్రయ్యకు పండంటి మనవడు పుట్టడంతో సంతోషంతో  ఉబ్బితబ్బిబయి పోయాడు.  అయినవాళ్ళనందరిని పిలిచి అబ్బాయి బారసాల  అట్టహాసంగా జరిపించాడు. మనవడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ మురిసిపోసాగారు.   కలిసొచ్చే  కాలమొస్తే  కోరుకున్నవన్నీ కాళ్ళముందుకొస్తాయన్నట్లు మందలోని  సూడి  గొర్రె ఒక పోతుపిల్లను ఈనింది.  చంద్రయ్య ఆనందం ఇంకాస్త ఎక్కువైంది. 

                   మగబిడ్డ కలిగినందుకు ఇంట్లో వాళ్ళు సంబరపడిపోతుంటే,  పోతుపిల్లను ఈనిన గొర్రె మాత్రం విచారంగా వుండసాగింది. “ దేవుడు నామీద కక్ష కట్టి నాకీ పోతుపిల్లను ఇచ్చాడు.  ఎంత అల్లారుముద్దుగా పెంచినా మూన్నాళ్ల ముచ్చటేగా.   ఏదో ఒక రోజు నాబిడ్డ  కసాయి వాడి కత్తికి  బలికావలసిందేగా.   నా తోటి గొర్రెలకు పుట్టిన పొట్టేళ్ళు  ఈ చంద్రయ్య కొడుకు పెళ్ళికి బలికావాల్సి వచ్చింది.  గొంతు కోసేముందు దీనంగా అవి అరిసే అరుపులుకు మేమెంతో విలవిలలాడిపోయాము.  మాకు కడుపుకోత మిగిల్చిన ఆ పెళ్లిని తలుచుకుంటేనే భయం.  వీళ్ళింట్లో ఏదైనా కార్యం జరగబోతుందంటే మా పిల్లల్లో ఎవరో ఒకరు బలికాబోతున్నారన్న మాట.  మమ్మల్ని బాగా మేపుతారు.  బలిసిన మా మగబిడ్డలను కర్కశంగా కత్తికి బలిచేస్తారు.  అందుకే  మరకపిల్లయితే   ఈ యాతనుండదు”  మదనపడసాగింది గొర్రె.

                    తప్పటడుగులు వేస్తూ  అటూ ఇటూ తిరుగుతున్న చంద్రయ్య మనవడికి ముద్దు మురిపాలు ఎక్కువైయ్యాయి.   మందలోవున్న పొట్టేలు పిల్ల పెరిగి పెద్దదయ్యింది.  యుక్త వయస్సుకొచ్చి బాగా బలిసింది. అది బలిసే కొద్దీ తన తల్లికి ఆందోళన ఎక్కువకాసాగింది.  ఇది బక్కచిక్కిపోతే బాగుణ్ణు.  మేత సరిగా లేకపోతే బాగుణ్ణని కోరుకునేది.  మనుషులైతే తమకు మగ బిడ్డ పుట్టాలని, పుట్టిన బిడ్డ  ఆరోగ్యంగా, పుష్టిగా బాగుండాలని కోరుకుంటారు.  మాకు పోతుపిల్ల పుడితే ఏదో ఒక రోజు కత్తికి బలికాక తప్పదు.   అభం శుభం తెలియని  గొర్రెలం గనకనే     అమాయక మనుషులను మాతో   పోలుస్తారు .  తల దించుకొని తలపోసుకుంటోంది తల్లి గొర్రె.

                   “ ఈరోజు పొట్టేలు పిల్లను అడవికి తోలుకోపోబాకు. దొడ్లోనే వుంచు.  పిల్లోడి పుట్టినరోజు పార్టీకి వేటని కొయ్యాల.” పశువుల కాపరితో  చంద్రయ్య చెప్పిన మాటలు విన్న తల్లి గొర్రెకు తన గొంతుకను ఎవరో కోస్తున్నట్లుగా అనిపించింది.  చంద్రయ్య ఇంట్లో మనవడి పుట్టినరోజు సంబర సన్నాహాలు చేస్తున్నారు.  ఇవన్నీ తనకు పట్టనట్లు పశువులకాపరి  పశువుల తోపాటు గొర్రెలమందను కూడా అడవికి తోలుకెళ్ళాడు.   తల్లి గొర్రె తన బిడ్డను వదలి వెళ్ళ లేక  కన్నీరు కార్చసాగింది .  పశువుల కాపరి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక పోతూ పోతూ తన బిడ్డను పదే  పదే  చూడసాగింది.

                   చీకటి పడే వేళకు పశువులతోపాటు గొర్రెల మందను కూడా ఇంటికి తోలుకొచ్చాడు పశువులకాపరి.  తన పిల్లను చూసుకోవాలన్న ఆతృతతో పరుగుపరుగున దొడ్లోకి పోయింది తల్లి గొర్రె. పిల్ల అక్కడ లేకపోయేసరికి   చుట్టూ తిరిగి చూసింది.   ప్రక్కనున్న పాకలో వంటలు చేస్తున్నారు.  వాటి ప్రక్కనే పొట్టేలు తల,  కాళ్ళు , తోలు పెట్టివున్నాయి.  వాటిని చూసిన  తల్లి గొర్రె ప్రాణం విలవిలలాడిపోయింది. నా బిడ్డను చంపేశారు.   వాళ్ళ బిడ్డ వేడుక కోసం నాబిడ్డను బలిచేసిన  మనుషులను ఈ గ్రామ దేవతే శిక్షించాలి.  అయినా  నా బిడ్డలాంటి జీవులనెన్నింటినో  బలి తీసుకుంటున్న ఆ  శక్తిని  శరణు కోరిన నేను వెర్రి గొర్రెను కాక మరేమిటి.  యుగాంతం వరకు మా బ్రతుకులింతే.  వైరాగ్యంతో విచారించ సాగింది గొర్రె.