Wednesday, 5 June 2013

గొర్రె వైరాగ్యం



                రామాపురంలో చంద్రయ్య పెద్ద రైతు.  ఆయనకు పొలాలు, తోటలు తోపాటు పశుసంపద కూడా బాగానే వుండేది.  చంద్రయ్య ఒక్కగానొక్క కొడుకును  బాగా చదివించాడు.  మంచి ఉద్యోగం కూడా.  వీరి స్థాయికి తగ్గ  కుటుంబంలోని  అమ్మాయితో వివాహం జరిపించారు.  పెళ్ళైన ఏడాదిలోనే కోడలు గర్భవతి అయినందుకు చంద్రయ్యకు ఆనందం కలిగింది.  వైద్య సదుపాయం సరిగా లేనందున  కోడల్ని  అమ్మగారింటికి పంపకుండా  ఇక్కడే కంటికి రెప్పలా  చూసుకోసాగాడు.

                   చంద్రయ్యకు పదికి  పైగా గొర్రెలు, పొట్టేళ్లు వుండేవి.  వాళ్లింట్లో  పశువుల కాపరి  పశువుల తోపాటు వీటిని కూడా అడవికి తోలుకెళ్లి మేపుకొస్తుండేవాడు.  వాటిలో ఒక గొర్రె సూడిదైంది. 

                   కోడలికి ప్రసవ  రోజులు వచ్చేసరికి కొడుకుని కూడా పిలిపించుకున్నాడు చంద్రయ్య. తాత కావాలని తహతహలాడుతున్న చంద్రయ్యకు పండంటి మనవడు పుట్టడంతో సంతోషంతో  ఉబ్బితబ్బిబయి పోయాడు.  అయినవాళ్ళనందరిని పిలిచి అబ్బాయి బారసాల  అట్టహాసంగా జరిపించాడు. మనవడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ మురిసిపోసాగారు.   కలిసొచ్చే  కాలమొస్తే  కోరుకున్నవన్నీ కాళ్ళముందుకొస్తాయన్నట్లు మందలోని  సూడి  గొర్రె ఒక పోతుపిల్లను ఈనింది.  చంద్రయ్య ఆనందం ఇంకాస్త ఎక్కువైంది. 

                   మగబిడ్డ కలిగినందుకు ఇంట్లో వాళ్ళు సంబరపడిపోతుంటే,  పోతుపిల్లను ఈనిన గొర్రె మాత్రం విచారంగా వుండసాగింది. “ దేవుడు నామీద కక్ష కట్టి నాకీ పోతుపిల్లను ఇచ్చాడు.  ఎంత అల్లారుముద్దుగా పెంచినా మూన్నాళ్ల ముచ్చటేగా.   ఏదో ఒక రోజు నాబిడ్డ  కసాయి వాడి కత్తికి  బలికావలసిందేగా.   నా తోటి గొర్రెలకు పుట్టిన పొట్టేళ్ళు  ఈ చంద్రయ్య కొడుకు పెళ్ళికి బలికావాల్సి వచ్చింది.  గొంతు కోసేముందు దీనంగా అవి అరిసే అరుపులుకు మేమెంతో విలవిలలాడిపోయాము.  మాకు కడుపుకోత మిగిల్చిన ఆ పెళ్లిని తలుచుకుంటేనే భయం.  వీళ్ళింట్లో ఏదైనా కార్యం జరగబోతుందంటే మా పిల్లల్లో ఎవరో ఒకరు బలికాబోతున్నారన్న మాట.  మమ్మల్ని బాగా మేపుతారు.  బలిసిన మా మగబిడ్డలను కర్కశంగా కత్తికి బలిచేస్తారు.  అందుకే  మరకపిల్లయితే   ఈ యాతనుండదు”  మదనపడసాగింది గొర్రె.

                    తప్పటడుగులు వేస్తూ  అటూ ఇటూ తిరుగుతున్న చంద్రయ్య మనవడికి ముద్దు మురిపాలు ఎక్కువైయ్యాయి.   మందలోవున్న పొట్టేలు పిల్ల పెరిగి పెద్దదయ్యింది.  యుక్త వయస్సుకొచ్చి బాగా బలిసింది. అది బలిసే కొద్దీ తన తల్లికి ఆందోళన ఎక్కువకాసాగింది.  ఇది బక్కచిక్కిపోతే బాగుణ్ణు.  మేత సరిగా లేకపోతే బాగుణ్ణని కోరుకునేది.  మనుషులైతే తమకు మగ బిడ్డ పుట్టాలని, పుట్టిన బిడ్డ  ఆరోగ్యంగా, పుష్టిగా బాగుండాలని కోరుకుంటారు.  మాకు పోతుపిల్ల పుడితే ఏదో ఒక రోజు కత్తికి బలికాక తప్పదు.   అభం శుభం తెలియని  గొర్రెలం గనకనే     అమాయక మనుషులను మాతో   పోలుస్తారు .  తల దించుకొని తలపోసుకుంటోంది తల్లి గొర్రె.

                   “ ఈరోజు పొట్టేలు పిల్లను అడవికి తోలుకోపోబాకు. దొడ్లోనే వుంచు.  పిల్లోడి పుట్టినరోజు పార్టీకి వేటని కొయ్యాల.” పశువుల కాపరితో  చంద్రయ్య చెప్పిన మాటలు విన్న తల్లి గొర్రెకు తన గొంతుకను ఎవరో కోస్తున్నట్లుగా అనిపించింది.  చంద్రయ్య ఇంట్లో మనవడి పుట్టినరోజు సంబర సన్నాహాలు చేస్తున్నారు.  ఇవన్నీ తనకు పట్టనట్లు పశువులకాపరి  పశువుల తోపాటు గొర్రెలమందను కూడా అడవికి తోలుకెళ్ళాడు.   తల్లి గొర్రె తన బిడ్డను వదలి వెళ్ళ లేక  కన్నీరు కార్చసాగింది .  పశువుల కాపరి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక పోతూ పోతూ తన బిడ్డను పదే  పదే  చూడసాగింది.

                   చీకటి పడే వేళకు పశువులతోపాటు గొర్రెల మందను కూడా ఇంటికి తోలుకొచ్చాడు పశువులకాపరి.  తన పిల్లను చూసుకోవాలన్న ఆతృతతో పరుగుపరుగున దొడ్లోకి పోయింది తల్లి గొర్రె. పిల్ల అక్కడ లేకపోయేసరికి   చుట్టూ తిరిగి చూసింది.   ప్రక్కనున్న పాకలో వంటలు చేస్తున్నారు.  వాటి ప్రక్కనే పొట్టేలు తల,  కాళ్ళు , తోలు పెట్టివున్నాయి.  వాటిని చూసిన  తల్లి గొర్రె ప్రాణం విలవిలలాడిపోయింది. నా బిడ్డను చంపేశారు.   వాళ్ళ బిడ్డ వేడుక కోసం నాబిడ్డను బలిచేసిన  మనుషులను ఈ గ్రామ దేవతే శిక్షించాలి.  అయినా  నా బిడ్డలాంటి జీవులనెన్నింటినో  బలి తీసుకుంటున్న ఆ  శక్తిని  శరణు కోరిన నేను వెర్రి గొర్రెను కాక మరేమిటి.  యుగాంతం వరకు మా బ్రతుకులింతే.  వైరాగ్యంతో విచారించ సాగింది గొర్రె.      

0 comments:

Post a Comment