Sunday, 23 June 2013

విహారయాత్ర


అవి నేను ఏడవ తరగతి చదివే రోజులు. సంవత్సర పరీక్షలు పూర్తికాగానే మా క్లాస్ టీచర్ పిల్లలందరిని విహారయాత్రకు తీసుకొని పోయేందుకు ఏర్పాట్లు చేశాడు. ఎక్కువ దూరం పోయేందుకు విద్యార్ధుల తల్లిదండ్రులు ఇష్టపడనందున దగ్గరలో వున్న ‘రామాయపట్నం’ కు వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు. సాయంకాలం 4.00 గంటలకు బయలుదేరి కొత్తసత్రంకు చేరుకొని అక్కడనుండి పడవ మీద బకింగ్ హామ్ కాలువగుండా రామాయపట్నం వరకు ప్రయాణం. ఆ రోజుల్లో మద్రాస్ ( నేటి చెన్నై) నుండి విశాఖపట్నం వరకు కోస్తా తీరం వెంబడివున్న బకింగ్ హామ్ కెనాల్ (ఉప్పు కాలువ) గుండా ఎండుచేపలు, ఉప్పు, కలప ఇతరత్రా సరుకులు రవాణా జరుగుతుండేవి. రవాణా చేయు పడవలు షుమారు 20 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పు వుండేవి. అందువల్ల మేము 25 మందిమి ప్రయాణించేందుకు అనుకూలంగానే వుండింది. రాత్రికి రామాయపట్నంలోనే వుండి సూర్యోదయాన్ని చూడాలనుకున్నందున రాత్రికి మరియు మరునాటికి భోజన ఏర్పాట్లుకు కావలసిన సరుకులు, పాత్రసామగ్రి వంట మనిషిని కూడా వెంట తీసుకుపోయాము.

సాయం సమయంలో కాలువ గుండా పడవ ప్రయాణం మాకెంతో ఆనందాన్నిచ్చింది. కాలువకు ఇరు వైపులా పెద్ద పెద్ద దట్టమైన పొదలు, పచ్చని చెట్లు, ఆ చెట్లపై వాలిన రకరకాల పక్షులు ముఖ్యంగా గుంపులు గుంపులుగా వాలిన వివిధ జాతుల కొంగలు, పక్షుల కిలకిలారావాలుతో మాటలకందని మధురానుభూతిని పొందాము. మేము బయలుదేరిన గంటలోపే రామాయపట్నం చేరుకున్నాం. మసక చీకటి అలుముకుంటోంది. సముద్రం దగ్గర్లో వున్న బంగళాలో మాకు బస ఏర్పాటు చేశారు. పేరుకు బంగళా అయినా అదొక పురాతన ఇల్లులా వుంటుంది. కిటికీ తలుపులు కూడా సక్రమంగా లేవు. ముందు, వెనుక పెద్ద పెద్ద చెట్లు. చుట్టూ సవుక తోటలు చూసేందుకే భయంగా వుంది. పైగా అతి దగ్గర్లో వున్న సముద్రపు ఘోషతో మా భయం ఇంకా పెరుగుతోందేకాని తగ్గడంలేదు. మాతో వచ్చిన వంటవాళ్లు రాత్రికి భోజనం ఏర్పాటు చేశారు.

“ అందరూ మాటలు కట్టిపెట్టి త్వరగా నిద్రపోండి. వేకువనే లేచి సూర్యోదయాన్ని చూసేందుకు పోవాల. అతిగా ప్రవర్తించి రాత్రులు అటూ ఇటూ తిరగబాకండి. ఇక్కడ పాములు, తేళ్ళు వుంటాయి జాగ్రత్త” హెచ్చరించాడు క్లాస్ టీచర్.

ఈ భయంకర వాతావరణంలోకి ఎందుకొచ్చాము దేవుడా అనుకుంటూ కళ్ళు మూసుకొని పడుకున్నానే గాని నాకు నిద్ర పట్టలా. కీచురాళ్ళ అరుపులు, సముద్రం పొంగి వస్తోందేమో అన్నట్లు అలల శబ్దం భయంకరంగా వుంది. వీటికి తోడు ఏదో వింత శబ్దంగా స్పురించే ఒకరిద్దరి గురకలు. ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ ఇవేమీ పట్టనట్లు నిద్రలో మునిగిపోయారు.

సముద్రం మీదినుంచి వచ్చే చల్లటిగాలికి చలి పుట్టుకొచ్చింది. కొందరు తాము తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకుంటే. మరికొందరు ముడుచుకొని పడుకోనుండిపోయారు. ఇవన్నీ గమనిస్తూ పడుకున్న నేను మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. అరకొర నిద్రలో వున్న నా మిత్రుడు రాజా ను లేపి నాకు తోడుగా రమ్మని పిలుచుకొనిపోయా. ఆ పరిసరాలు మాకు అంతగా తెలియనందున ఎటువైపు వెళ్లాలో మసక వెన్నెల్లో అర్ధం కాలా. ఏది ఏమైనా అవసరం కాబట్టి కొంచెం ముందుకు కదిలాం. మూత్ర విసర్జన చేస్తూ ఏదో అలికిడి అయ్యేసరికి అటువైపు చూశా. గుండె గుభేల్ మంది. మూత్రమంతా చెడ్డీలోనే అయిపోయాయి. కొంచెం దూరంలో తెల్లని ఆకారం చేతులు చాపుకొని ముందుకురుకుతున్నట్లు అనిపిస్తోంది. అమ్మో దయ్యం. ఇలాంటి చోటే దయ్యాలుంటాయని చెప్పుకుంటుంటే విన్నా. పెద్దగా అరవాలన్నా నోరు పెగలడంలేదు. గొంతుకను ఎవరో నొక్కిపట్టినట్లయింది. భయంతో కాళ్ళు చచ్చుపడిపోయి కదలలేని స్థితిలో వుండిపోయాను. నాకు తోడుగా వచ్చిన రాజా ఎంతసేపురా అని విసుక్కొని వెళ్లిపోయాడు. ధైర్యాన్ని కూడగట్టుకొని కాళ్లీడ్చుకుంటూ బంగళా వైపు నడిచా. చెట్ల క్రింద రాలిన ఎండుటాకులపై సరసరమని ఏదో కదులుతున్నట్లు శబ్దం. కాళ్ళపైకి ఏదో పాకుతున్నట్లనిపించింది. బహుశా తేలేమో. కాలిని గట్టిగా విదిలించి ఒక్క అంగలో బంగళా చేరుకున్నా. వెంట తెచ్చుకున్న దుప్పటి కప్పుకొని పడుకున్నాకూడా తెల్లని ఆకారమే గుర్తుకొస్తూవుంది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఊపిరి బిగబట్టుకొని పడుకున్నా. మూత్ర విసర్జనకు పోకున్నా బాగుండేది. పోయి పోయి దాని కంట్లో పడ్డా. ఏమి జరుగుతుందో ఏమో అనుకుంటూ భయంతో అలాగే వుండిపోయా.

వేకువజామున 4.30 గంటలయ్యింది. క్లాస్ టీచర్ అందరినీ నిద్రలేపాడు. తోటి విద్యార్ధులందరికి నిద్ర మత్తు వీడేసరికి ఓ పావుగంట పట్టింది. వీళ్ళందరూ మేల్కొనేసరికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అందరూ మూత్ర విసర్జన కోసం బంగళా చుట్టుప్రక్కలకు పోయారు. నేను కూడా వారితో కలిసి వెళ్లా. రాత్రి జరిగింది గుర్తుకొచ్చి చుట్టూ చూశా. బంగళా వెనుక వైపు దగ్గర్లోనే ఆ ఆకారం వుంది. రాత్రి నేను భయపడ్డట్టు దెయ్యం కాదు భూతం కాదు అది పంట చేలో వుంచిన దిష్టి బొమ్మ. రెండు చేతులు చాపుకొని వుంది. దాన్ని చూడగానే ధైర్యం వచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు చూశా భూమిలోని చిన్న చిన్న బొరియల్లోంచి చిన్న చిన్న సముద్రపు ఎండ్రకాయలు అటూ ఇటూ తిరుగుతున్నాయి. బహుశా రాత్రి నా కాలుపైకి ఎక్కింది కూడా ఇదే అయివుంటుందనుకున్నా.

సూర్యోదయానికి ముందే సముద్రం వద్దకు చేరుకున్నాం. సముద్రంలోకి పిల్లలెవరినీ వెళ్లనీయకుండా కట్టడి చేశాడు మా టీచర్. నీలి రంగు సముద్రం, ఆకాశం రెండూ అంటుకుపోయినట్లుంది. ఆకాశం నిర్మలంగా వుంది. సూర్యోదయానికి ముందు ఆకాశం రంగులు మారుతోంది. సప్తవర్ణాల వెలుగులు సముద్రపు ఆవలి వైపు నుండి పైకి ఫోకస్ చేస్తున్నట్లుగా వుంది. క్రమేపీ సూర్య బింబం సముద్రంలోంచి పైకి వస్తోంది. ఎర్రని పాత్రని వివిధ రూపాల్లో బోర్లించినట్లున్న దృశ్యం మాకు కనపడింది. అందరం తదేకంగా చూస్తూ వుండిపోయాము. కొద్ది క్షణాల్లోనే సంపూర్ణ సూర్య బింబం పైకి వచ్చింది. తదుపరి అందరం మాస్టారు గారు మరికొందరి సహాయంతో సముద్ర స్నానాలు చేశాం.

వంట వాళ్ళు తయారు చేసి వుంచిన టిఫిన్లు తిని మరలా సముద్రం వద్దకు చేరుకున్నాం. అలలకు కొట్టుకొచ్చిన గవ్వలు ఏరుకుంటూ , సముద్రపు కెరటాలు పాదాలను తాకుతుంటే ఆనందానుభూతిని పొందుతూ తిరుగుతున్నాం. ఇంతలో చేపల వేటకు వెళ్ళిన తెప్పలు ఒక్కొక్కటిగా రావడం ప్రారంభమైంది. జాలర్లు గుంపులు గుంపులుగా వచ్చి వలలను సముద్రంలోంచి బయటకు లాగసాగారు. వలలు ఒడ్డుకు వచ్చిన తర్వాత మేమందరం గబ గబా చేపలను చూసేందుకు వెళ్ళాం. కానీ వాళ్ళు మమ్మల్ని దగ్గరికి రానీయలేదు. వలలలోని చేపలను పెద్ద పెద్ద గంపల్లో వేశారు. రెండో, మూడో పెద్ద ఆకుల్లాగ సన్నని పొడవాటి తోక వున్న చేపలని బయట పడేశారు. అవి టేకు చేపలని తర్వాత తెలిసింది. అక్కడున్న జాలర్లందరూ ఒక్కసారిగా అరుస్తూ చేపలను వదిలి కొంచెం దూరం వెనక్కి వచ్చేశారు. ఆ అరుపులకు మేము బిత్తరపోయాం. ఏమైందో అర్ధంకాక వాళ్ళ వైపే చూస్తూవుండిపోయాం. అక్కడ పెద్ద సైజు సాలెపురుగు లాగ నల్లని బొచ్చుతో వున్న సముద్ర జీవి ఒకటుంది. అది ఎగిరి అమాంతం మనుషులపై పడుతుందట. దాన్ని తాకితే చాలు క్షణాల్లో మనిషి ప్రాణం పోతుందట. అందుకే వాళ్ళు అలా అరుస్తూ దూరంగా జరిగారని తర్వాత తెలిసింది. ఒకతను పరుగెత్తికెళ్లి కర్రకు గుడ్డ చుట్టి తీసుకొచ్చాడు. దానిని అంటించి ఆజీవి మీద పెట్టి కాల్చారు. అది చచ్చిన తర్వాతనే వాళ్ళు తమ పని చేసుకోసాగారు.

మేము ఏర్పాటు చేసుకున్న పడవ సరైన సమయానికి రాకపోయేసరికి మేము సాయంత్రం వరకు అక్కడే వుండక తప్పలేదు. ఆటలు, పాటలు మాకు ఆనందదాయకంగా వుంటే మా టీచర్ మన జాతీయ నాయకులను గురుంచి చెప్పిన విషయాలు ఎంతో స్పూర్తి దాయకంగా వున్నాయి. ఎట్టకేలకు సాయంత్రం 4.00 గంటలకు పడవ వచ్చింది. అందరం సంచులు సర్దుకొని పడవ ఎక్కి కూర్చున్నాం. రామాయపట్నం ఊరు దాటి నాలుగైదు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఏమైందో ఏమో పడవలోకి నీళ్ళు రాసాగాయి. పడవలో వున్న వాళ్ళు నీళ్ళు తోడిపోయడంతోనే సరిపోయింది. తెడ్లు ఎంతగా వేసినా పడవ వేగంగా ముందుకు కదలడంలేదు. మేమందరం పడవలోనే నీళ్ళలో నిలబడాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు తెచ్చిన పడవను ఏవో సరుకులుంటే మద్రాస్ కు పంపారట. దానికి బదులుగా దీనిని తీసుకొచ్చారు. ఉప్పు కాలువకు ఇరువైపుల ప్రకృతి దృశ్యాలు ఆహ్లాదకరంగా వున్నా ఈ పడవ వల్ల అసౌఖర్యంగా వున్నందున ఆ అనుభూతిని పొందలేక పోయాం. ఎమౌతుందో నన్న భయంతో సాగిన మా ప్రయాణం ఎట్టకేలకు బాగా చీకటి పడే సమయానికి కొత్తసత్రం గ్రామం చేరికతో ముగిసింది.

0 comments:

Post a Comment