“ సాయంత్రం ఏడు
గంటలైనా సెగ తగ్గలేదు. ఆరు గంటలవరకు ముఖం బయట పెట్టలేకున్నాం. సాయంకాలం పూట బయట
ఎక్కడైనా కూర్చుందామన్నా కింద కాలిపోతోంది.
ఏం ఎండలో ఏమో. ఈ మండే ఎండలు ఇంతకుమునుపెప్పుడు చూడలా”. రైల్వే
స్టేషన్లో ప్లాట్ ఫామ్ చివరన బెంచీలమీద
కూర్చుంటూ చెపుతున్నాడు రామకృష్ణయ్య తన స్నేహితుడు ప్రసాదరావుతో.
రిటైర్డ్
ఎంప్లాయీస్ ఎక్కువగా సాయంత్రం పూట రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ చివరన ఉన్న
బెంచీలపై కూర్చొని పిచ్చా పాటి మాట్లాడు కుంటుంటారు. వర్తమాన రాజకీయాలు,
పెన్షన్లు, చదువులు, ఫీజులు, నిత్యావసర వస్తువుల ధరలు, వాతావరణ పరిస్థితులు
ఒకటేమిటి అన్ని విషయాలపై చర్చలు, వాదోపవాదనలు అనుదినం
జరుగుతుంటాయి.
“ మీ మనవడు టెన్త్ మంచి మార్కులుతో పాసయ్యాడటగా,
ఇంటర్ ఎక్కడ చేరుస్తున్నారు? అడిగాడు రామకృష్ణయ్య .
“
ఎక్కడ చేర్చాలో అర్ధం కావడం లేదు.
9.5 పైగా పాయింట్లు వచ్చిన వాళ్ళకు ఫీజు మినహాయింపు ఇస్తామని
రెండు మూడు కాలేజీల వాళ్ళు ఇంటిచుట్టూ తిరుగుతున్నారు. మరి కొందరైతే ఐ.ఐ.టి. కోచింగు కూడా ఫ్రీగానే
ఇస్తామంటున్నారు. ఫీజు లేదుకదాని ఎక్కడపడితే
అక్కడ చేరిస్తే చదువులు ఎలావుంటాయో ఏమో. కాలేజీలో వసతులు బాగున్నాయో లేదో, ఏదీ నిర్ణయించుకోలేక పోతున్నాం” చెప్పాడు ప్రసాదరావు.
ఇంతలో
వీరితో కలిశాడు చంద్రయ్య. పిల్లల చదువు
విషయమై చర్చ ప్రారంభమయ్యింది. “ ఈ
రోజుల్లో చదువు వ్యాపారమే బాగా లాభసాటిగా వుందండీ. నర్సరీ పిల్లలకు పదివేలట. స్కూలు కెళ్ళి వాళ్ళు చదివేదేముంది చెప్పండి?
ఏవో బొమ్మలు చూపెట్టడం, మధ్యాహ్నం వాళ్ళకు తెచ్చిన బాక్సులలోని బోజనం పెట్టడం, నిద్రపుచ్చడం అంతేకదా. మాటలుకూడా సరిగ్గా రాని పసి పిల్లలను బడికి పంపే
తల్లిదండ్రులకుండాలి జ్ఞానం. మాకలా కాదు, అయిదు సంవత్సరాలు నిండితేగాని
బడిలో వేసేవాళ్ళు కాదు. అది గవర్నమెంట్
చట్టం కూడా. మేము చదువుకొనేటప్పుడు ప్రతి
క్లాసు పాస్ కావాలి. తప్పితే అదే క్లాసు
మళ్లీ చదవాలి. ఇప్పుడలా కాదు స్కూలుకెళితే
చాలు పై క్లాసుకు పంపుతారు. ఒక్క టెన్త్
కు మాత్రం పబ్లిక్ పరీక్ష పెట్టారు.
మున్ముందు అదీ తీసేస్తారంట. ఇక
చదువులో సత్తా ఏముంటుందండి” తన
అభిప్రాయాన్ని వెల్లబుచ్చాడు చంద్రయ్య.
“
గవర్నమెంట్ స్కూళ్ళలో, కాలేజీలలో
ఇప్పుడు పెద్దగా ఎవరూ చదవడంలేదు.
అలా చదవడం కూడా నామోషీగా ఫీలయ్యే వాళ్ళుకూడా లేకపోలేదు. ఇప్పుడు ఈ ప్రయివేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా
పుట్టుకొచ్చాయిగాని, ఇంతకుముందు మేమంతా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినోళ్ల మేగదా. అక్కడ చదివినోళ్ళు గొప్పవాళ్లుకాలేదా? కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదవడం ఇప్పుడొక స్టేటస్ సింబల్
అయిపోయింది. ఆర్ధిక స్థోమత లేకున్నా
అప్పులు చేసైనా ప్రైవేట్ విద్యాసంస్థల్లో తమ పిల్లలను చేర్చేందుకు వెనుకాడడంలేదు
తల్లితండ్రులు. అంత డబ్బు పోసి
చదివించినా చదువు అంతంతమాత్రమే” నన్న రామకృష్ణయ్య మాటలకు
“
అవునండీ, ఈ కార్పొరేట్
కాలేజీలవాళ్లు వేలకువేలు ఫీజులు వసూలు చేసి వందలాదిమందిని తమ కాలేజీలలో చేర్చుకుంటారు. చేర్చుకున్న నెలలోపు వీళ్ళు నిర్వహించే
పరీక్షలో వచ్చిన మార్కులను బట్టి
విద్యార్ధులను గ్రేడింగ్ చేస్తారు.
బాగా మెరిట్ వున్న విద్యార్ధులను ప్రత్యేకించి ఒక సెక్షన్ గా ఏర్పాటు చేస్తారు. వారికి మాత్రమే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
అన్ని వసతులలోనూ వీరికి ప్రత్యేక కేటాయింపు
వుంటుంది. మిగతావారిని సాధారణంగా చూస్తారు. విద్యార్ధులందరి
వద్ద ఒకే విధమైన ఫీజు వసూలు చేసినపుడు ఈ వివక్ష తగునంటారా. తమ వ్యాపారం కోసం
గ్రేడ్లు కావాలి. గ్రేడ్లు కోసం
విద్యార్ధులను వర్గీకరించి వారి ఆత్మ
స్థైర్యాన్ని దెబ్బతీయడం కాక మరేమిటి. ఫలితాలు ప్రకటించిన రోజునుండి దాదాపు
నెలరోజుల వరకు తమ తమ రాంకుల గురుంచి, హంగు ఆ ఆర్భాటం గురుంచి
డబ్బా కొట్టుకోవడం అందరికీ తెలిసిందే .
అసలు తమ కాలేజీ నుండి ఎంతమంది పరీక్షకు హాజరయ్యారు, ఎన్ని రాంకులు వచ్చాయన్న విషయం ఎవరైనా చెబుతున్నారా? ఏ రెండు వేల మందో హాజరైతే అక్కడ వచ్చేది
వందలోపే రాంకులు. మరి మిగతా వారి పరిస్థితేంటి. వాళ్ళ సంస్థల్లో అంత బాగా చదువు
చెబితే మిగతా వారికెందుకు రాంకులు రాలేదు.
అలా రాంకులు వచ్చినవాళ్లు స్వతహాగా
తెలివైన వాళ్లైవుంటారు. ఇందులో వీళ్ళ
గొప్పతనమేమీ లేదు. వాళ్ళు ఎక్కడున్నా రాంకులు
సాధించుకోగలరు. కాకపోతే పాపం వీళ్ళను కార్పొరేట్ కాలేజీలవాళ్లు వ్యాపార వస్తువుగా ఉపయోగించుకుంటారు అంతే.
మొద్దు కత్తికి సాన అవసరంగాని, బాగా పదునైన కత్తికి సాన వీళ్ళు పట్టేదేముంది. యావరేజ్ స్టూడెంట్స్ ను రాంక్ హోల్డర్స్ గా
తీర్చి దిద్దగలిగితే అప్పుడు ఆ కాలేజీ వాళ్ళ గొప్పతనాన్ని ప్రశంసించవచ్చు”. విద్యా సంస్థల గురుంచి తెలుసుకున్న విషయాలు
విశదీకరించాడు చంద్రయ్య.
“
ఇంకొక విషయమేమంటే ఇప్పుడు జరుగుతున్న పోటీ పరీక్షలు చాలామటుకు మల్టిబుల్ ఛాయిస్ లోనే
వుంటున్నాయి. ప్రశ్నాపత్రం లోని ప్రశ్నలకు కొన్ని తెలిసిన జవాబులు గుర్తిస్తే మిగతా వాటికి ఊహాజనిత జవాబులు గుర్తించడం జరుగుతోంది. అదృష్టం
కొద్దీ అలా గుర్తించిన జవాబులు
సరైనవయితే రాంకులు పొందే అవకాశం వుంటుంది.
దీనివల్ల అసలైన ప్రతిభావంతులు నష్ట
పోతారు. అందువల్ల ఈ పద్ధతినే మార్చాల్సిన
అవసరం ఎంతైనావుంది. మల్టిబుల్ ఛాయిస్ విధానాన్ని పూర్తిగా రద్దుచేసి కేవలం ప్రశ్నలు మాత్రమే యిచ్చి జవాబులు వ్రాయమనే
పద్ధతి తీసుకొస్తే బాగా చదువుకొనేవాళ్ళకు,
ప్రతిభ గల వాళ్ళకు న్యాయం చేసినవాళ్లవుతారు. ప్రభుత్వం
ఈ విధానాన్ని మేధావులతో పున:సమీక్షించి సవరణ చేస్తే బాగుంటుంది”. తన ఆలోచన చెప్పిన రామకృష్ణయ్య మాటలతో చర్చను
ముగించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

0 comments:
Post a Comment