సర్వ శుభకార్యాలకు
ఆగ్ర తాంబూలం నేనే
పూజలకు ప్రమాణాలకు ముఖ్యం నేనే
వివాహాల ప్రధానాలకు
ప్రధానం నేనే
శోభనంలో శోభంతా నాదే
నవనవలాడే నవ వధువులాంటి నన్ను
తలా తోక త్రుంచి వెన్ను విరిచి సున్నం పూసి
ముక్కలైన వక్కకలిపి కసితీరా నమిలి
ఆధరాలకు అందాన్నిచ్చే
ఎర్రని నా రక్తాన్ని ఉమ్ముతారు
అశుభాలలో, అంతిమ యాత్రలలో
నన్ను విసిరి
విసిరి పారేస్తారు
నాపై నూనె రాసి నిప్పు సెగ పెట్టి
చిన్నారుల కడుపునొప్పికి పట్టీ వేస్తారు
భుక్తాయాసానికి ముఖ్య దినుసును నేనే
వైద్యంలో నేనే నైవేద్యంలో నేనే
నాకు ముళ్లు లేవు
మృధుత్వం తప్ప
ఆవిశలా ఆసరా దొరికితే అల్లుకుపోయేనన్ను
అణువణువు విరిచి
అశక్తురాలిని చేస్తారు
తరతరాలకైనా తలరాత మారని తమలపాకుని నేను.

0 comments:
Post a Comment